ఎర్రరాతి నిర్మాణం.. పది కాలాలు పదిలం
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

ఎర్రరాతి నిర్మాణం.. పది కాలాలు పదిలం

అల్గోల్‌లో నవాబుల కాలంలో నిర్మించిన భవనం

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: ఎర్రరాతి కట్టడాలు ఏవైనా ఆకర్షణకు మారుపేరుగా నిలుస్తాయి. పటిష్ట నిర్మాణం, పదిలంగా పదికాలాల మన్నిక, చెక్కుచెదరని కళా వైభవం ఇవన్నీ ఆ కట్టడాల సొంతం. అందుకే నేటితరం ఈ తరహా కట్టడాలపై అమితాసక్తి కనబరుస్తున్నారు. జహీరాబాద్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తుండటంతో మనకూ ఉన్నాయి ఎర్రకోటలు అంటూ ప్రజలు సంతోషపడుతున్నారు.

జహీరాబాద్‌లో దండిగా ఎర్రరాతి నేలలు ఉండటం, తక్కువ వ్యయానికే దొరకడం, నిర్మాణ సౌలభ్యంతో ఈ తరహా కట్టడాలకు స్థానికులు ప్రాధాన్యం ఇస్తుంటారు. జహీరాబాద్‌, కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, మునిపల్లి, రాయికోడ్‌ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లలో నూటికి 90 శాతం వీటితో నిర్మించినవి కావడం విశేషం. స్థానికంగా లభించే ఎర్రరాయి సామాన్యుల స్థోమతకు అందుబాటులో ఉండటంతో ఈ కట్టడాలపై అమితాసక్తి పెరుగుతోంది.


గుడుపల్లిలో కచేరీ భవనం

బహుళ అంతస్తుల వరకు...

చిన్నపాటి నిర్మాణం మొదలుకుని బహుళ అంతస్థుల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఎర్రరాతి నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కట్టడాలు అన్నికాలాల్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టత కలిగి ఉంటాయి. నిర్మాణాలపై సిమెంటు, రంగులు వేయడం అవసరం ఉండకపోవడంతో నిర్మాణదారులకు ఖర్చు తక్కువే. భారీ వర్షాలు కురిసినా రాయిపై నుంచి ఇట్టే నీరు జారిపోవడంతో కట్టడం దెబ్బతినకుండా ఉండటం వీటి ప్రాముఖ్యత. ఇందుకు అవసరమైన రాతి గనులు పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు అందుబాటులో ఎర్రరాయి పుష్కలంగా లభిస్తోంది.


మాచునూరులో బురుజు

చెక్కుచెదరని కళాత్మక నిర్మాణాలు...

శతాబ్దల కాలం క్రితం ఎర్రరాయితో కట్టిన నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరలేదు. నవాబుల కాలంలో ఊరూరా నిర్మించిన బురుజులు, ఆలయాలు, దర్గాలు, గ్రామ ముఖద్వారాలు, కచేరీలు గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జహీరాబాద్‌, అల్గోల్‌ గ్రామాల్లో అప్పటి నవాబులు నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాలు నేటికి పక్కాగానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ కళాశాల ప్రహరీ, ఇతర భవనాలకు ఇక్కడి రాయినే తరలించి నిర్మాణాలు చేపట్టారు. అద్భుత శైలిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కనువిందు చేస్తున్నాయి. ఇంటి ముందు అరుగులు, స్తంభాలు, బురుజుకోటలు ప్రత్యేకతను చాటుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని