కత్వలో గల్లంతయిన ఇద్దరు యువకుల మృతి
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

కత్వలో గల్లంతయిన ఇద్దరు యువకుల మృతి


పవన్‌, విక్కీ మృతదేహాలు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఈసీ వాగు కత్వలో సోమవారం గల్లంతయిన ఇద్దరు యువకులు మృతిచెందారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం మృతదేహాలను వెలికితీసింది. సోమవారం మొయినాబాద్‌ మండలం వెంకటాపూర్‌ సమీపంలోని ఈసీ వాగు కత్వలో సరదాగా ఈతకు వెళ్లిన సజ్జన్‌పల్లికి చెందిన సన్‌వెల్లి పవన్‌కుమార్‌(22), ఇదే గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేసే వికారాబాద్‌ జిల్లా నాగసముందర్‌కు చెందిన విఠల్‌ అలియాస్‌ విక్కీ(22) గల్లంతయ్యారు. స్థానిక తహసీల్దార్‌ వై.అనితారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు, గజ ఈతగాళ్లను రప్పించి సోమవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయమే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలకు దిగింది. ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

ఘటనా ప్రదేశాన్ని సందర్శించిన ఎమ్మెల్యే : నీటమునిగి మృతిచెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని