ఘాటు గాలికి అల్లాడి.... రోగాలతో తన్లాడి!
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

ఘాటు గాలికి అల్లాడి.... రోగాలతో తన్లాడి!

రసాయన పరిశ్రమలతో జనం అష్టకష్టాలు

తరచూ అనారోగ్య సమస్యలు.. భవిష్యత్తుపై భయం

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, జీడిమెట్ల, రంగారెడ్డినగర్‌, న్యూస్‌టుడే

పరికి చెరువు మత్తడి వద్ద రసాయన నురగ

కొద్దిసేపు కంపు వాసనొస్తే ముక్కు మూసుకుంటాం.. ఇంకొంచెం పెరిగితే తప్పించుకుని పక్కకెళ్లిపోతాం.. పాపం.. వాళ్లకా అవకాశం లేదు.. భరించక తప్పదు. అదీ ముక్కు పుటాలదిరే ఘాటు వాసనలు. రాత్రయితే ఉక్కిరిబిక్కిరి చేసే గాలులే కాదు, భూమి నుంచి తోడుకున్న నీటినీ ముట్టుకోలేని దుస్థితి. ఒకవేళ తాకితే చర్మ వ్యాధులు, ఘాటు గాలులతో కళ్ల మంటలు, శ్వాసకోశ సంబంధిత రోగాలు, గొంతు సమస్యలు.. తరచూ చిన్నారులను వేధించే జ్వరాలు. ఇదీ నగరంలోని కొన్ని పారిశ్రామిక వాడలు, వాటి నుంచి పారే నాలాల్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో బతుకెళ్లదీస్తున్న జనం అనుభవిస్తున్న నిత్య నరకం. హానికారక రసాయన పరిశ్రమల తరలింపు ప్రక్రియ పత్రాలకే పరిమితం కావడంతో ఏళ్లుగా పరిస్థితిలో ఏ మార్పూ లేదని ఇక్కడి నివాసితులు వాపోతున్నారు.

ఏళ్లుగా మారని కథ

జీడిమెట్ల, పటాన్‌చెరు పారిశ్రామికవాడల పరిధిలోని చాలా ప్రాంతాల్లో రాత్రిపూట ఊపిరి పీల్చేందుకు వీల్లేనంత ఘాటు వాసనలు వెలువడుతున్నాయి. తినేందుకు వికారం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భూగర్భ జలాలు కూడా పనికిరాకుండా పోయాయి. ఈ ప్రాంతం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న మంజీరా నీటినే తాగునీరు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. అప్పుడప్పుడు రంగు మారి వచ్చే బోరు నీళ్లు వాడితే తర్వాత చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలు మొదలవుతున్నాయని జనం వాపోతున్నారు.

బోరు నుంచి వస్తున్న రంగునీరు

అమ్మో రసాయ‘నాలా’!

జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి మొదలై బేగంపేట మీదుగా హుస్సేన్‌సాగర్‌ చేరుతోంది రసాయన నాలా. ఫతేనగర్‌ వద్ద ఈ నాలాకు సూరారం నుంచి వచ్చే నాలా కలుస్తోంది. ఇది సూరారం, గాజుల రామారం, షిర్డీహిల్స్‌ దాటి శేరిలింగంపల్లిలోని సిక్కుల బస్తీ, ఆల్విన్‌ కాలనీ, ధరణీనగర్‌ పరికి చెరువు చేరుతుంది. అక్కడే ఈ చెరువును విషతుల్యంగా మార్చుతోంది. ఈ రెండు నాలాలు ఫతేనగర్‌ వద్ద కలిసి ఒకే నాలాగా హుస్సేన్‌సాగర్‌ చేరుతుంది. ఈ నాలా నుంచి నేరుగా వ్యర్థ జలాలు సమీపంలోని చెరువులు, కుంటల్లోకి చేరుతున్నాయి. అంబీర్‌ చెరువు, హుస్సేన్‌సాగర్‌, ఇతర చెరువులు విషం కావడానికి కారణమిదే. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

చర్మంపై దద్దుర్లు

ఆసుపత్రికే ఖర్చవుతున్నాయి!

పారిశ్రామిక వాడలతో పాటు నాలాల పరిసరాల్లోని నివాసిత జనం.. వచ్చే ఆదాయంలో సగానికెక్కువ ఆసుపత్రులకే అవుతోందంటున్నారు. రసాయన గాలులతో జీడిమెట్ల, భాగ్యలక్ష్మి కాలనీ, ప్రశాంత్‌నగర్‌, ఐడీపీఎల్‌ కాలనీ, ధరణి కాలనీ, కల్యాణి నగర్‌, నవజీవన్‌ నగర్‌, బాలానగర్‌, సనత్‌నగర్‌, ఫతేనగర్‌, మెథడిస్ట్‌ కాలనీ, మయూరి మార్గ్‌, ప్రకాశ్‌నగర్‌, బేగంపేట, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని గాంధీనగర్‌, కవాడిగూడతో పాటు ట్యాంక్‌బండ్‌ కింద దాదాపు 25బస్తీలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాయి. రసాయన నాలా పరిసర ప్రాంతాల్లోనే ఈ పదేళ్లలో దాదాపు నలభై మంది దాకా వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడి చనిపోయారని, అందులో కలుస్తున్న ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలే కారణమని కూకట్‌పల్లి స్థానికులు వాపోతున్నారు.


చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి

దాదాపు 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన విషంతో బోరు నీళ్లను వాడటమే మానేశాం. తప్పనిసరై వాడితే చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. దద్దుర్లు, చర్మం మంట, దురదలొస్తున్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదులిచ్చినా మార్పు లేదు.

- తిరుపతిరెడ్డి, సుభాష్‌నగర్‌


చంటిబాబుకు తరచూ జ్వరమే..

ఎనిమిదేళ్లుగా ఈ నాలా పరివాహకంలోనే ఉంటున్నాం. పైనుంచి వచ్చే రసాయనాలు, మురుగుతో వెలువడే ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండున్నరేళ్ల బాబు నెలకి కనీసం రెండుసార్లు జ్వరం బారిన పడుతున్నాడు. ఇంట్లో పాత్రలన్నీ రంగు మారిపోతున్నాయి.

- శాలిని, గాంధీనగర్‌


శాశ్వత పరిష్కారం చూపండి

పరిశ్రమల నుంచి కాలుష్యం తగ్గిందనుకుంటే ఖాజీపల్లి పారిశ్రామికవాడ నుంచి రసాయన వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ నాలాల్లో కలిపేస్తున్నారు. ఇది జనారోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. నాలాలో చేపడుతున్న బెడ్డింగ్‌ పనులు పూర్తి చేయాలి. సమస్యను పరిష్కరించాలి.

- పీఎస్‌ఎన్‌ మూర్తి, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని