ఆరోగ్య కేంద్రాల్లో...అన్నీ అరకొరే!
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

ఆరోగ్య కేంద్రాల్లో...అన్నీ అరకొరే!

న్యూస్‌టుడే,  పాత తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ

అంగడి రాయిచూర్‌లో..

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మండలానికి ఒకటి, రెండు చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఇవి ఉన్నా లేనట్లుగానే కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్లో అనూహ్య మార్పు వచ్చింది.  పీహెచ్‌సీలు ఆధునిక వైద సౌకర్యాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రారంభించాయి. తొలినాళ్లలో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాగున్నా కాలం గడిచేకొద్దీ సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. కొన్నిచోట్ల మందులుంటే తాగునీరు లేదు. మరికొన్ని చోట్ల రోగులకు తగినట్లుగా వైద్యులు లేరు. అంతేకాదు పలు ఇతర సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

తాకిడి ఎక్కువ... సౌకర్యాలు తక్కువ
వికారాబాద్‌ నియోజక వర్గంలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. జిల్లా కేంద్రం కావంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.  రామయ్యగూడ ఒక్క కేంద్రంలోనే సౌకర్యాలు బాగున్నాయి. ఇక మోమిన్‌పేట, నాగసముందర్‌ తదితర కేంద్రాల్లో కుర్చీలు, బల్లలు, తాగునీటి వసతి లేక ఇక్కట్లు తప్పడంలేదు. 

ఒప్పంద వైద్యులతో నెట్టుకొస్తున్నారు
కొడంగల్‌ మండలం అంగడిరాయిచూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒప్పంద వైద్యులే పనిచేస్తున్నారు. అదికూడా ఒక్కరే కావడంతో ఆయన సెలవుపై ఉంటే ఇక వైద్యం అందనట్లే. స్టాఫ్‌ నర్స్‌ సైతం లేరు. దౌల్తాబాద్‌  పీహెచ్‌సీలో మలేరియా, విరేచనాలకు మందులు లేకపోవడంతో రోగులు బయట కొనాల్సి వస్తోంది. ఇక్కడా ఒప్పంద వైద్యులు ఒక్కరే ఉన్నారు. 108 వాహనం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలే దిక్కు. బొంరాస్‌పేట పీహెచ్‌సీలో మధుమేహం మాత్రలు, ఇతర మందులు అందుబాటులో లేవు. వైద్యులు లేక 102 వాహనంలోని సిబ్బందితో చికిత్సలు నిర్వహిస్తున్నారు. 

అదనపు బాధ్యతలతో వెళ్తే వేచి చూడాలి
తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ పీహెచ్‌సీలో వైద్యురాలికి కు.ని.పర్యవేక్షణ అదనపు బాధ్యతలున్నాయి. ఆమె వేరే ప్రాంతానికి వెళితే సేవలు అందవు. ఈ ఆసుపత్రికి ప్రహరీ లేకపోవడంతో రాత్రిపూట మందుబాబులు అడ్డా చేసుకుంటున్నారు.  యాలాల, తాండూరు, జిన్‌గుర్తి, పెద్దేముల్‌ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సమస్య ఇబ్బందిగానే ఉంది.

ఉన్నవీ అందడంలేదు
పరిగి నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో వైద్యులతోపాటు తగినన్ని మందులు లేకపోవడం, ఉన్నవి కూడా రోగులకు అందకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ సామాజిక ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా ఉంటోంది. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్తే మందులు, ఇంజక్షన్లు బయటకు రాస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టాక్సిం ఇంజక్షన్లు అక్రమంగా బయటకు వెళ్తున్నట్లు రోగులు చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని,  కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు.

పరిగిలో బయటి నుంచి ఇంజక్షను తెచ్చుకుంటున్న రోగి

ఇదీ లెక్క

* జిల్లాలోని మొత్తం పీహెచ్‌సీలు: 24
* వైద్య సిబ్బంది: తక్కువే
* రోగుల సంఖ్య: నిత్యం 60 నుంచి 100 వరకు
* ఎక్కువ జబ్బులు: జలుబు, దగ్గు, ఆయాస,ం జ్వరం, కీళ్ల నొప్పులు, పలు ప్రమాదాల బాధితులు
*
 ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో 6 నుంచి 8 వరకు ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్‌, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సు ఉంటారు. ఈ కేంద్రాల్లో 6 నుంచి 10 వరకు బెడ్స్‌ ఉంటున్నాయి. ప్రతి నెల ఈ కేంద్రాల్లో 4 నుంచి 10 ప్రసవాలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి.

మందుల కొరత లేదు: డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్‌
జిల్లాలో ఏ పీహెచ్‌సీలోనూ మందుల కొరత లేదు. రాష్ట్ర ఔషధ గిడ్డంగి నుంచి జిల్లా కేంద్రమైన అనంతగిరి ఔషధ గిడ్డంగికి మందులు సరఫరా చేస్తారు. ఇక్కడున్న అధికారి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫార్మసిస్టుకు అవసరమైన మందులు పంపిణీ చేస్తారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుపుతున్నారు. ఈ కేంద్రాలకు అత్యవసరంగా మందులు అవసరం ఉన్నప్పుడు వారు బయట కొనుగోలు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని