సర్కారు పాఠశాలకు జేజే
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

సర్కారు పాఠశాలకు జేజే

ప్రభుత్వ బడిలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. రోజురోజుకు చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రైవేటుకు దీటుగా ఆంగ్ల, తెలుగు, ఉర్దూ మాధ్యమాలు ఉండడం.. ఉపాధ్యాయుల చక్కగా పాఠాలు చెపుతుండటంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తోంది. ప్రభుత్వ బడిలోనే చదువుకుంటే ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవచ్చని భావన పెరిగింది. కరోనా నుంచి గట్టెక్కిన తరువాత గతేడాది, ప్రస్తుత విద్యాసంత్సరంలో పదివేల మంది అదనంగా పాఠశాలలో చేరారు. ఈ వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం...

న్యూస్‌టుడే, పాత తాండూరు

జిల్లాలోని 19 మండలాల పరిధిలో 748 ప్రాథమిక, 118 ప్రాథమికోన్నత, 156 ఉన్నత పాఠశాలలు, 11 ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రస్తుతం 92,284 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2020-21లో 82,313 మంది చదువుకున్నారు. ఈఏడాది అదనంగా 9,971 మంది విద్యార్థులు చేరారు. ప్రతి రోజు 100-150 మంది వరకు కొత్త విద్యార్థులు చేరుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవలనే వసతి గృహాలు తెరుచుకోవడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

భోజనం సమయంలో విద్యార్థులు..

ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ..

కరోనా వల్ల రెండేళ్ల పాటు చదువులు వెనకబడ్డాయి. ఇన్నాళ్లు చదివిన చదువును విద్యార్థులు గుర్తుకుతెచ్చుకునేందుకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని చదవడం, రాయడం, గుణించడం వాటిపై కసరత్తు చేయిస్తున్నారు. పాఠాల బోధనను తగ్గించి, ఒక్కో విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. అన్ని పాఠ్యాంశాల్లో చురుకుగా ఉండేలా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు.

ప్రైవేటు నుంచి ..

ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడం, పంటలు సరిగా లేకపోవడం.. కరోనా నష్టాలు కలిగించడం వంటి కారణాలతో చాలా కుటుంబాలు పట్టణ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరంతా ఉన్న ఊరిలోనే ఆంగ్ల మాధ్యమ బోధనలో చేరారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ బడిలో చేరుతున్నారు. వికారాబాద్‌ మండలంలో 1,228, పరిగి 1,134, తాండూరు 1,980, మర్పల్లి 705 మంది, మిగతా మండలాల్లో 300-650 మంది వరకు విద్యార్థులు ప్రభుత్వ బడిలో అదనంగా చేరారు.

ఈ ఏడాది చేర్పించా

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా కుమారుడిని ప్రైవేటు బడిలో చదివించా. ఈఏడాదే ఆరోతరగతికి ఉన్నత పాఠశాల ఆంగ్ల మాధ్యమంలో చేర్పించా. పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. చదువుకు ఖర్చు ఇబ్బంది తప్పింది.

- విశ్వనాథం, విద్యార్థి తండ్రి, పాత తాండూరు

తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది

ప్రభుత్వ బడిలో నాణ్యమైన బోధన, విద్యార్థులకు అన్ని సౌకర్యాల కల్పిస్తుండడంతో తల్లిదండ్రులకు నమ్మకం  పెరుగుతోంది. కరోనా తరువాత విద్యావ్యవస్థను దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని బోధన చేస్తున్నారు. మన ఊరి బడిని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఆ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. నిత్య పర్యవేక్షణ వల్ల మార్పు వస్తోంది.

- రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని