పసిడి పట్టాం.. పరిశోధనల్లో మెరుస్తాం
eenadu telugu news
Updated : 28/10/2021 05:45 IST

పసిడి పట్టాం.. పరిశోధనల్లో మెరుస్తాం

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, ఉస్మానియా యూనివర్సిటీ: రెండేళ్లు కష్టపడి చదివారు.. సబ్జెక్టులపై పట్టు సాధించారు.. తోటి విద్యార్థులతో పోటీపడి ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుని బంగారు పతకాలు సాధించారు. తమ ప్రతిభను ఇక్కడికే పరిమితం చేయకుండా భవిష్యత్తులో పరిశోధనలు కొనసాగిస్తామని, మరిన్ని ఉన్నత చదువులు చదువుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా బంగారు పతకాలు అందుకున్న పలువురు విద్యార్థులు ‘ఈనాడు’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారిలా...

ఆవిష్కరణలు చేయాలని:

  సుశాంత్‌, ఎమ్మెస్సీ, (2018-19)

సమాజనికి ఉపయోగపడే ఏదైన నూతన ఆవిష్కరణలు చేయాలనే తపనతో రసాయనశాస్త్రం ఎంపిక చేసుకున్నా. ఇంటర్‌ నుంచే సబ్జెక్టుపై ఆసక్తి పెరిగింది. పరిశోధన కోసం యూజీసీ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేశాను. ఇక్కడి అధ్యాపకుల ప్రోత్సాహంతో పాటు రసాయనశాస్త్రంలో ఆసక్తి ఐదు బంగారు పతకాలు సాధించేందుకు ఉపయోగపడింది.

అధ్యాపకుల ప్రోత్సాహంతో సాధించా:

బి.స్వప్న, ఎమ్మెస్సీ(2019-20)

అధ్యాపకులు ఇచ్చే నోట్్స ఉపయోగపడింది. రెండు బంగారు పతకాలు సాధించా. పీహెచ్‌డీ పూర్తి చేసి పరిశోధన రంగంలోనే రాణించాలని అనుకుంటున్నాను. రసాయనశాస్త్రం పరిశోధనతో ప్రజలకు చౌక ధరలలో ఔషధాలు తయారు చేయాలనుకుంటున్నా.

పట్టుదలతో చదివా:

గౌరి ప్రియ, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ (2018-19)

మొదటి సెమిస్టర్‌లో టాప్‌ ర్యాంక్‌ లభించకపోవడం ఎంతో బాధ కలిగింది. ఎలాగైన ర్యాంక్‌ సాధించాలనే కసితో మిగిలిన మూడు సెమిస్టర్‌లు చదివి రెండు బంగారు పతకాలు సాధించాను. కుటుంబసభ్యులు, అధ్యాపకుల సహకారం ఉపయోగపడింది. భవిష్యత్తులో పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ పట్టా సాధించాలనుకుంటున్నా. ప్రస్తుతం ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బోధిస్తూనే పరిశోధనపై దృష్టి సాధించాను.

రాసుకుంటూనే చదువుకునేదాన్ని:

ఫౌజియా ఉన్నీసా, ఎమ్మెస్సీ, మూడు బంగారు పతకాలు

కోఠి మహిళా కళాశాలలో 2019-20 సంవత్సరంలో ఎమ్మెస్సీ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తి చేశా. డిగ్రీ స్థాయిలోనూ బంగారు పతకం సాధించాను. ఎమ్మెస్సీలో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ ఎంచుకున్నా. పాఠ్యాంశాలపరంగా ఎప్పటికప్పుడు చదువుకోవడమే కాకుండా ఎక్కువగా రాయడం ప్రాక్టీసు చేశా. సీఎస్‌ఐఆర్‌ క్వాలిఫై అయ్యాక పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం అధ్యాపకురాలిగా చేస్తున్నా.

దేశ సంస్కృతిని తెలియపరుస్తా:

కె.లిఖిత, ఎంఏ సంస్కృతం(2019-20)

రెండు బంగారు పతకాలు సాధించాను. సంస్కృత భాషలో సాహిత్యంతోపాటు ఎంతో విజ్ఞానం దాగి ఉంది. వాటిపై పరిశోధన చేసి దేశ పురాతన సంస్కృతిని ప్రపంచానికి తెలియపరుస్తా.


92 ఏళ్ల వయసులో డాక్టరేట్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: స్నాతకోత్సవంలో 92 ఏళ్ల వయసులో డాక్టరేట్‌ పట్టాను రామచందర్‌రావు కాలే అందుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలానికి చెందిన కాలే హిందీ విభాగంలో పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఓయూ హిందీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని