close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
160 టన్నుల భారీ ఇసుక డంపు స్వాధీనం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన దాడుల్లో భారీగా 160 టన్నుల ఇసుక డంపును స్వాధీనపరచుకున్నారు. జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. చిన్నచౌకు ఠాణా పరిధిలోని వాటర్‌గండి సమీపంలో వెంకట శ్రీరాములు అనే వ్యక్తి అక్రమంగా 160 టన్నుల ఇసుక డంపును నిల్వ ఉంచాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి దాడులు చేసి ఇసుక డంపును స్వాధీనపరచుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి, ఇరువురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ట్రాక్టరు, 4.5 టన్నుల ఇసుకను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.
గల్ఫ్‌లో మహిళ మృతి
చీమలచెరువుపల్లి(గాలివీడు), న్యూస్‌టుడే: కుటుంబం పోషనకు గల్ఫ్‌ దేశానికి వెళ్లి నాలుగు రూకలు సంపాదించుకుని పేదరిక కష్టాల నుంచి బయటపడొచ్చని భావించిన చిన్న లక్ష్మమ్మ ఆశలు తీరక ముందే కువైట్‌లో ఆమె మృతిచెందింది. ఈ మేరకు మంగళవారం గాలివీడు మండలం చీమలచెరువుపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలియగానే గ్రామంలో విషాదం నెలకొంది. బంధువుల తెలిపిన వివరాల మేరకు.. రెడ్డివారిపల్లికి చెందిన చిన్న లక్ష్మమ్మ(45) అనే మహిళ సోమవారం సాయంత్రం కువైట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కువైట్‌లోని ఓ సేఠ్‌ ఇంటిలో పని కుదర్చుకున్న లక్ష్మమ్మకు ఇంటి యజమాని సకాలంలో నెల నెల జీతం ఇవ్వకుండా ఆమెను వేధించడంలో మానసిక వేదన భరించలేక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈమె తొమ్మిది నెలల కిందట గల్ఫ్‌ దేశానికి వెళ్లింది.  భర్త ఇటీవల మృతిచెందాడు.  మృతురాలికి కుమారుడు ఉన్నాడు.  లక్ష్మమ్మ మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని కమ్మవారిపల్లెకు చెందిన కేశవనారాయణ (27) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై మోహన్‌ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కేశవనారాయణకు 22 రోజుల క్రితం పెళ్లి అయింది. ఈ నెల 4వ తేదీన జామ తోట వద్ద విష రసాయనం తాగాడు. స్థానికులు గుర్తించి పోరుమామిళ్ల ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. తిరుపతి ఆసుపత్రి పోలీసుల సమాచారం మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆకేపాడు(రాజంపేట), న్యూస్‌టుడే : రాజంపేట మండలం ఆకేపాడులోని చిన్న అచ్చనపల్లికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేపాడు సమీపంలోని వడ్డెకాడిపల్లిలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సమస్యలతో కొద్ది రోజుల కిందట భార్యభర్తలు విడిగా ఉంటున్నారు. ఈనెల 6న వడ్డెపల్లికి వెళ్లి భార్యను కాపురానికి రావాలిని వెంకటసుబ్బయ్య పిలవడం.. ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని మన్నూరు పోలీసులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న అతడిని తిరుపతికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
10న వాహనాల వేలం
చిన్నచౌకు (కడప): జిల్లా ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో (ఎస్‌ఈబీ) దాడుల్లో దొరికిన వాహనాలను ఈ నెల 10వ తేదీ వేలం వేస్తున్నట్లు ఎస్‌ఈబీ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ద్విచక్ర వాహనాలేనన్నారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు మొత్తం రుసుంతో పాటు జీఎస్టీని ప్రభుత్వ చలానా పేరిట చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు కడప ఎస్‌ఈబీ అధికారులను సంప్రదించాలన్నారు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.