కొప్పర్తి...తీర్చేనా నిరుద్యోగుల ఆర్తి...!
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

కొప్పర్తి...తీర్చేనా నిరుద్యోగుల ఆర్తి...!

2.50 లక్షల మంది ఉపాధికి కార్యాచరణ

పలు పరిశ్రమలు తెచ్చేందుకు వ్యూహరచన

పారిశ్రామికవాడలో నిర్మాణమవుతున్న రహదారులు

కమలాపురం, న్యూస్‌టుడే : జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడ కొత్త కళ సంతరించుకుంటోంది. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు కల్పించడంతో పాటు అవసరమైన అన్ని వనరులను అందిస్తుండడంతో అందరి దృష్టి కొప్పర్తిపై మళ్లింది. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తుండటంతో పాటు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అందుకు అనుగుణంగా 2.50లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నారు.

పారిశ్రామికవేత్తల ఆసక్తి...

కడప నగర సమీపంలోని కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు భూమి లీజుకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఫర్నీచర్‌ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న నీల్‌కమల్‌ సంస్థ, విద్యుత్తు మోటార్ల తయారీ రంగంలో పేరొందిన పిట్టి ఇంజినీరింగ్‌ సొల్యూషన్‌ సంస్థ కూడా ఇక్కడ పరిశ్రమ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చర్‌ క్లస్టర్‌ ద్వారా మరికొన్ని సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఫార్మారంగంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలు, సిలిండర్ల తయారీ పరిశ్రమ, ఆక్సిజన్‌ ప్లాంటును నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. సరకు ఉత్పత్తులను తరలించే కాంకోర్‌ సంస్థకు చెందిన రైలు వ్యాగన్లు తయారు చేసే సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రోత్సాహం, వైజాగ్‌ కారిడార్‌లో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కు ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన డిక్సన్‌ కంపెనీ నిర్మాణ పనులు​​​​​​​

డిక్సన్‌ సాంకేతికతో ఎలక్ట్రానిక్స్‌ తయారీ

రాష్ట్ర ప్రభుత్వం డిక్సన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కులోని ఈఎంసీ-3లో నెలకొల్పేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ద్వారా అనేక రకాల ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీకి కొప్పర్తి కేంద్రంగా మారనుంది. డిక్సన్‌ సంస్థ ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, కెమెరా తదితర వస్తువులను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2,500 నుంచి 3,000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అత్యధిక మందికి ఉపాధి

కొప్పర్తి పారిశ్రామికవాడలోని వివిధ కంపెనీల్లో అత్యధిక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ యువతకు ఇది గొప్ప సదవకాశం. ఆరు ఫార్మా కంపెనీల నిర్మాణాలకు సెప్టెంబరు నెలలో శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతుంది. ప్రస్తుతం రూ.5 వేల కోట్లు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పడనున్నాయి. రానున్న రోజుల్లో కొప్పర్తి పెద్ద పారిశ్రామికవాడగా తయారు కానుండడం జిల్లా వాసుల అదృష్టంగా భావించవచ్ఛు - రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సలహాదారు●


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని