విజయం సాధించాలంటేరామబాణం సంధించాలి!
eenadu telugu news
Published : 29/07/2021 01:21 IST

విజయం సాధించాలంటేరామబాణం సంధించాలి!

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిందే

జిల్లా నూతన కలెక్టర్‌ ముందు ప్రధాన సవాళ్లు

- ఈనాడు డిజిటల్‌, కడప

జిల్లాలో రోజురోజుకీ భూఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నిత్యం భూకబ్జాలు, రెవెన్యూ దస్త్రాల్లో అక్రమ మార్పులు, అనధికార లేఅవుట్లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది అధికారుల ఉదాసీన వైఖరితోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలున్నాయి. భూ ఆక్రమణలు ఆధారాలతో సహా వెలుగుచూస్తున్నా జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పనులతోపాటు జిల్లా కేంద్రమైన కడప నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, బుగ్గవంక చుట్టూ రక్షణ గోడల నిర్మాణం, దేవుని కడప చెరువు సుందరీకరణ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వీటన్నింటితో పాటు ప్రధాన సమస్యల పరిష్కారంపై జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయరామరాజు ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

భూకబ్జాలపై సత్వర చర్యలు తీసుకోవాలి

ముద్దనూరు మండలం బొందలకుంటలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలో ఉన్నా వాటిని జిరాయితీ పట్టాల కింద కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ఇదే మండలంలోని మరి కొన్ని గ్రామాల్లోనూ భారీస్థాయిలో అక్రమాలు జరిగాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించి సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. అనంతరం ఎలాంటి చర్యలు తీసు కోలేదు. ● కడప నగర పరిధిలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. ● ఇటీవల బి.కోడూరు, ప్రొద్దుటూరు, సిద్దవటం మండలాల్లో భూ ఆక్రమణలు బయటపడినా చర్యలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

గండికోట నిర్వాసితుల అవస్థలు తీర్చండి

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గండికోట జలాశయంలో 26 టీఎంసీల నీటిని నిల్వ చేసింది. తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం, చామలూరు, ఎర్రగుడి నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఖాళీ చేయించింది. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులను క్షమాపణలు కోరారు. నిర్వాసితుల సమస్యలను మరో మూడు నెలల్లో పరిష్కరించేందుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా కృషి చేయాలని ప్రజల సమక్షంలో ఆయన వెల్లడించారు. ఏడు నెలలు గడిచినా పునరావాస కాలనీల్లో అంతర్గత రహదారులు, విద్యుత్తు కనెక్షన్లు, ఇతర మౌలిక వసతులు కల్పించలేకపోయారు. మొదట పనులు వేగంగా జరిగినా అనంతరం ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు అసంపూర్తిగా నిలిపి వేశారు. ఈ విషయంలో కలెక్టర్‌ విజయరామరాజు ప్రత్యేక శ్రద్ధ వహించి ముంపువాసుల కష్టాలను తీర్చాల్సి ఉంది.

సాగునీరందిస్తేనే యురేనియం గ్రామాలకు ఊరట

వేముల మండలం తుమ్మలపల్లెలో యురేనియం కర్మాగారం ఏర్పాటుతో పులివెందుల మండలం కణంపల్లె, వేముల మండలం కేకే కొట్టాల, మబ్బుచింతల పల్లె, తుమ్మలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, కోట గ్రామాల్లో కాలుష్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజల జీవనాధారమైన వ్యవసాయం చేయడానికి కూడా అనువైన పరిస్థితులు ఉండట్లేదు. భూగర్భజలం కలుషితమవుతుండడంతో పంటల సాగు రైతులకు తలకు మించిన భారంగా మారింది. ప్రభావిత గ్రామాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగుగునీరందించే పనులను త్వరితగతిన పూర్తిచేసి స్థానిక ప్రజలకు ఊరట కలిగించాలి. ఆయా గ్రామాల్లో నెలకొన్న ఇతర సమస్యలపైనా దృష్టిసారించాలి.

కలెక్టర్‌గా విజయరామరాజు బాధ్యతల స్వీకరణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా కొత్త కలెక్టర్‌గా విజయరామరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా కలిసి సన్మానించారు. సంయుక్త కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మాలోల, సబ్‌కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతన్‌గార్గ్‌, ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు, కడప తహసీల్దారు శివరామిరెడ్డి, పలువురు అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను పూర్తిచేసి జిల్లాను ముందంజలో ఉంచుతామన్నారు. ప్రధానంగా జగనన్న కాలనీల నిర్మాణ లక్ష్యాలు సకాలంలో పూర్తిచేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేవిధంగా కృషి చేస్తామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని