అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

నేర సమీక్షలో ఎస్పీ

మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలోని పోలీసులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్‌ హెచ్చరించారు. జిల్లాలో ఎర్రచందనం, ఇసుక, మద్యం అక్రమ రవాణాతోపాటు క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా, జూదంపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పెన్నార్‌ సమావేశమందిరంలో బుధవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసులను 50 రోజుల్లో దర్యాప్తు ముగించి ఛార్జీషీటు దాఖలు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను బాగు చేయించాలని ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని, మహిళల చరవాణుల్లో దిశ యాప్‌ డౌన్‌లోడు చేయించాలని సూచించారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో భూతగాదాలు, ఇతర సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా స్పందన ఫిర్యాదులపై తక్షణం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, రైతులను మోసగించే వ్యాపారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమీక్షలో అదనపు ఎస్పీలు దేవప్రసాద్‌, మహేష్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌.ఐ.లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని