అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

జనగామటౌన్‌, న్యూస్‌టుడే : ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం కార్డులను మారుస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం జనగామ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.1.60 లక్షల నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. జనగామ సచివాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రూరల్‌ రాజానగరం మండలం దేవాంచెరువు గ్రామానికి చెందిన కొమ్మరాజు వీరసాయికిరణ్‌, అలియాస్‌ చౌదరి, రాజమండ్రి అర్బన్‌ అన్నపురంపేట బోస్‌ బొమ్మస్ట్రీట్‌కు చెందిన కరాటకం సాయికిరణ్‌, ఇన్నేస్‌పేటకు చెందిన కొప్పిశెట్టి రాజ్‌కుమార్‌, ఆలమూరు మండలం మండపేటకు చెందిన ఇల్ల వెంకటసాయి చెడు అలవాట్లకు బానిసలుగా మారడంతో దొంగతనాలు ప్రారంభించారు. కార్లలో తిరుగుతూ ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేసుకోలేని వారిని గుర్తించి సాయపడుతున్నట్లు నటిస్తారు. పిన్‌ నెంబర్లను తెలుసుకొని ఏటీఎం కార్డులను మార్చుతారు. తర్వాత వేరే ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. గతంలో వీరు పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. జనగామలోని నెహ్రూ పార్కు వద్ద ఉన్న ఏటీఎం కేంద్రాల సమీపంలో కారులో ఉన్న వీరిని బుధవారం జనగామ, వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు, రూ.1.60 లక్షల నగదు, 5 నకిలీ ఏటీఎం కార్డులు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. వనపర్తిటౌన్‌, సూర్యాపేట, రంగారెడ్డి, చేవెళ్ల, కర్నూల్‌, కడప, చిత్తూరు తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి డబ్బులు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో కొప్పిశెట్టి రాజ్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని