శ్రీశైలం జలాలపై కేసీ రైతుల ఆశలు
eenadu telugu news
Updated : 29/07/2021 06:40 IST

శ్రీశైలం జలాలపై కేసీ రైతుల ఆశలు

ఆగస్టు మొదటి వారంలో సాగునీరు విడుదలయ్యే అవకాశం 

కేసీ కాలువలో ప్రవహిస్తున్న నీరు

మైదుకూరు, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం నిండడంతో జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. దీంతో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తన మార్పుతో అధిక దిగుబడులొస్తాయనే ఆశతో పొరుగు జిల్లాల నుంచి వ్యాపారులు తెప్పించిన వరి వంగడాలను సేకరిస్తున్నారు. గతేడాది ఆగస్టు 1వ తేదీన కాలువకు నీటి విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఇదే సమయానికి నీరు విడుదల చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలతో కేసీ కాలువకు నీటిని మళ్లించే కుందూ నది రాజోలి ఆనకట్ట వద్ద ప్రస్తుతం 2వేల క్యూసెక్కులు ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో లీకేజీ రూపంలో కేసీ కాలువలోకి చేరుతున్న నీటితో మైదుకూరు వద్ద జలకళ కనిపిస్తోంది. అయితే ఈ నీటిని నమ్ముకుని రైతులు నారుమళ్లు పోసే పరిస్థితి కనిపించలేదు. కేసీ కాలువలో నీటిమట్టం పెరిగేవిధంగా చర్యలు తీసుకుంటేగానీ రైతులు ముందడుగు వేసే పరిస్థితి లేదు. 885 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల శ్రీశైలం జలాశయంలో బుధవారం నాటికి 882.10 అడుగులకు నీరు చేరింది. ప్రస్తుతం 199.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో 4.65 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి  853.8 అడుగులతో 88.88 టీఎంసీలు నీరు నిల్వ ఉండేది. జలాశయంలో పెరిగిన నీటిమట్టంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నీరు విడుదల చేస్తే పంటల సాగుకు భరోసా కలుగుతుంది. దీనిపై కేసీ కాలువ ఈఈ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ నీటి విడుదలపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని, ఆగస్టు మొదటి వారôలో నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని