200 ఎకరాల్లో బెరైటీస్‌ క్లస్టర్‌
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

200 ఎకరాల్లో బెరైటీస్‌ క్లస్టర్‌


సమావేశంలో పాల్గొన్న రాజోలి వీరారెడ్డి, జేసీ ధర్మచంద్రారెడ్డి, చాన్‌బాషా

కడప ఎన్‌జీవో కాలనీ, న్యూస్‌టుడే : జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో వైఎస్సార్‌ బెరైటీస్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం కడపలో వాణిజ్య ఉత్సవ్‌-2021 ఘనంగా నిర్వహించారు. సమావేశానికి జేసీ ధర్మచంద్రారెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్‌ చాన్‌బాషా, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు జయలక్ష్మి జిల్లాలోని వివిధ పరిశ్రమల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా, రాష్ట్రంలోనూ వివిధ రకాల పరిశ్రమల విలువలను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఆక్వా, ఎలక్ట్రానిక్స్‌ రంగాలను సందర్శించడానికి సొంత ఖర్చులతో వియత్నాం, తైవాన్‌ దేశాలలో పర్యటించడానికి పరిశ్రమల అధినేతలు తమ వివరాలను జిల్లా పరిశ్రమల శాఖకు పంపాలన్నారు. జిల్లా పారిశ్రామిక ప్రగతి, జిల్లాకు రాబోతున్న భారీ పరిశ్రమల గురించి, వనరుల లభ్యత, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. చైతన్య కెమికల్స్‌ అధినేత ఎస్‌.వి.రామమూర్తి, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ హెచ్‌ఆర్‌డీ మేనేజరు సుబ్రహ్మణ్యం పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వనరుల లభ్యత, ఉత్పత్తి, ఎగుమతుల వివరాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల అధినేతలు, పరిశ్రమ ఔత్సాహికులు, యువత పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని