గర్భంలోనే చిదిమేస్తున్నారు...
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

గర్భంలోనే చిదిమేస్తున్నారు...

యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు ●

ఆగని భ్రూణహత్యలు ●

బాల, బాలికల మధ్య అంతరం

న్యూస్‌టుడే, కడప  : ఆకాశంలో సగం. మానవ సమాజ మనుగడలో కీలకమైన అతివలు.. ఆధునిక సాంకేతిక యుగంలో కాలుమోపని ప్రాంతం లేదు. అయినా వీరి పట్ల వివక్ష ఏమాత్రం తగ్గటంలేదు. పురుషాధిక్య సమాజంలో భ్రూణ హత్యలు గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా సాగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా బాలబాలికల మధ్య అంతరం తగ్గటంలేదు. అమ్మ కడుపులో నలుసు బుజ్జి పాపాయి అని తెలియగానే నలిపివేసే సంస్కృతి నిరాఘాటంగా కొనసాగుతోంది.

జిల్లాలో బాల, బాలికల మధ్య నెలకొన్న అంతరం ఆందోళన కలిగిస్తోంది. మునుపటి కంటే కొంత మార్పు వచ్చినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వారసుడు కావాలనే ఆశ అమ్మానాన్నల్లో కన్పిస్తోంది. మహిళ గర్భిణి అయిన తర్వాత ఆ ఇంట్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. బిడ్డ పెరిగేకొద్దీ కడుపులో ఉన్నది అమ్మాయా, అబ్బాయా అనే ఆసక్తి మొదలవుతోంది. దీంతో కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఆపై ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు తెగబడుతున్నారు.

జిల్లాలో 2016-17 నుంచి 2020-21 వరకు అయిదేళ్లలో 2,39,139 ప్రసవాలు జరిగాయి. సజీవ జననాలు 2,39,659 జరిగాయి (కవలలతో కలిపి) వీరిలో మగబిడ్డలు 1,23,070 మంది ఉంటే ఆడపిల్లలు 1,16,589 మంది జన్మించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు అయిదు నెలల్లో 15,951 కాన్పులు జరిగితే సజీవ జననాలు 15,985 జరిగాయి. ఇందులో బాలురు 8,340, బాలికలు 7,645 మంది జన్మించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు నాలుగు నెలల్లో చూస్తే కొన్నిచోట్ల వెయ్యి మంది బాలురకు 70-80 శాతం లోపే బాలికలు ఉన్నారు.

చిట్టితల్లుల మరణ మృదంగం మోగుతున్నా అధికార యంత్రాంగంలో ఆశించిన స్థాయిలో కదలిక కనిపించటంలేదు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థికంగా, విద్యా పరంగా ముందంజలోని కుటుంబాల్లో కూడా భ్రూణ హత్యలు సాగుతున్నాయి.

తల్లి కడుపులో అమ్మాయి ఉందని పరీక్షల్లో నిర్ధారణ కాగానే బలవంతపు గర్భస్రావాలు చేయిస్తున్నారు. అరక్షిత గర్భ విచ్ఛిత్తులు సురక్షితం కాదని వైద్యులు చెబుతున్నా పెద్దగా ఫలితం కనిపించటంలేదు. లింగ నిర్ధారణ కోసం స్కానింగ్‌ కేంద్రాలకు పరుగు తీస్తున్నారు.

గర్భకోశ వ్యాధుల వైద్యాలయాల్లోనూ కొంతమంది పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం రూ.5-10 వేలు తీసుకుని వెల్లడిస్తున్నారు. ఇది ప్రభుత్వ పీసీ పీఎన్‌డీటీ చట్టానికి విరుద్ధం. అయినా ఎవరూ పూర్తి స్థాయిలో అడ్డుకోలేదు. ఈ కారణంగా జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు సాగుతూనే ఉన్నాయి.

నిర్ధారణ పరీక్షలపై నిఘా

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెట్టాం. బాల, బాలికల నిష్పత్తిలో కొంత అంతరం ఉన్న మాట వాస్తవమే. అందుకే స్కానింగ్‌ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందించిన వారి పేర్లను అత్యంత గోప్యంగా పెడతాం. నిజమైతే సమాచారం అందించిన వారికి పారితోషికం రూ.లక్ష అందజేస్తాం. బాల, బాలికల మధ్య ఎక్కువగా వ్యత్యాసం లేకుండా క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కనీసం 980 మంది ఆడపిల్లలు ఉండాలి. ఎక్కడైనా ఇంతకంటే తక్కువగా ఉంటే కారణమేంటి అని ఆయా ప్రాంతాల వైద్యాధికారులతో లోతైన విశ్లేషణ చేస్తున్నాం. - డాక్టరు కె.నాగరాజు, డీఎంహెచ్‌వో, కడప

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్‌-జులై వరకు బాల-బాలికల నిష్పత్తి ఇలా

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని