వస్త్రం వెనక్కి...దస్త్రం  ముందుకు 
eenadu telugu news
Updated : 27/09/2021 06:30 IST

వస్త్రం వెనక్కి...దస్త్రం  ముందుకు 

● ఆప్కోలో అక్రమం వెలుగులోకి

● రూ.19 కోట్ల మేర విలువ

● నివేదిక కోరినఉన్నతాధికారులు

న్యూస్‌టుడే, కడప గ్రామీణ : ఆప్కోలో తరచుగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రూ. 19 కోట్ల విలువైన వస్త్రం వెనక్కి పంపామని రూపొందించిన దస్త్రాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఇందులో అవకతవకలు చోటుచేసుకున్నాయని అనుమానిస్తున్నారు. జిల్లాలో తయారయ్యే చేనేత వస్త్రాలకు దేశ విదేశాల్లో మంచి పేరుంది. ఇక్కడి నేత కార్మికులు మంచి రకాలను నేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా జిల్లా నుంచి పట్టు వస్త్రాలు వెళ్తున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామస్వామి, విజయవాడ కనదుర్గమ్మ దేవస్థానానికీ పట్టు వస్త్రాలను జిల్లా కార్మికులే నేస్తున్నారు.

చేనేత సహకార సొసైటీల కార్మికులు నేసిన వస్త్రాలను ఆప్కో రెండు రకాలుగా కొనుగోలు చేస్తుంది. ఒకటి లివరి రకం, మరొకటి సాధారణ రకం. లివరి రకాన్ని ప్రభుత్వ ఆదేశంతో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, వసతి గృహాలకు దుప్పట్లు, తువాళ్లు, ప్రభుత్వ పరిధిలో పనిచేసే కార్మికుల దుస్తులు, తదితరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకాన్ని ఆప్కో పరిధిలో ఉన్న విక్రయ కేంద్రాలకు పంపుతుంది. వస్త్రాలను కొనుగోలు చేయడమే కాక సంఘాలకు గతంలో దారం అందజేసేవారు.

అక్రమాలు ఇలా...

చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాన్ని వెనక్కి పంపే విధానం ఆప్కో ఏర్పడినప్పటి నుంచి లేదు. వస్త్రంలో ఏదైనా లోపం ఉంటే ఆ కొలతల మేర అదే సొసైటీకి ఇచ్చి తిరిగి అంతే కొలతల్లో కొత్త వస్త్రం తిరిగి నేయించుకోవాలి. ఇది ఇప్పటి వరకు వస్తున్న విధానం. అయినా సంస్థ అధికారులు, యంత్రాంగం చేతివాటం ప్రదర్శించి సొసైటీలకు వస్త్రం వెనక్కి పంపినట్లు దస్త్రాల్లో రాసుకున్నారు. అలా వెనక్కి ఇచ్చిన వస్త్రం వందలు, వేల మీటర్లు కాదు... సుమారు 20 లక్షల మీటర్ల వరకు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వస్త్రం విలువ సుమారు రూ.19 కోట్ల ఉంటుందని సమాచారం.

జిల్లాలోని సొసైటీల నుంచి కొనుగోలు చేసిన వస్త్రం గోదాముల్లో నిలువ ఉంచామని, ఆ సమయంలో వర్షానికి తడిసి పనికిరాకుండా పోయిందని అందుకే ఆ వస్త్రాన్ని 2019 డిసెంబరులో వాటికి వెనక్కి పంపామని ఆప్కో అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే జిల్లా అధికారులు తమంతట తామే నిర్ణయం తీసుకుని వెనక్కి పంపటంపై తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల ఆరా..

ఆప్కో ప్రధాన కార్యాలయం (విజయవాడ) అధికారులు దీనిపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమయ్యారు. రూ.19 కోట్ల విలువైన వస్త్రాన్ని ఎవరి అనుమతి లేకుండా ఎందుకు వెనక్కి ఇచ్చారని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కొనుగోలు చేసిన వస్రాన్ని వెనక్కి పంపే సంప్రదాయం అప్కోలో లేదు. మరెందుకు అలా చేశారని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. వీటిపై వివరాలు ఇవ్వాలని ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో జిల్లా అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. వెంటనే ఆ వివరాలు పంపాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

కొనుగోలు చేసిన వస్త్రాన్ని వెనక్కి ఇచ్చినట్లు చూపుతున్న అధికారుల లెక్కల వెనుక పెద్ద రహస్యమే దాగి ఉందని, ప్రభుత్వం విచారణకు ఆదేశించడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. కొనుగోలు చేసిన వస్త్రాన్ని భౌతికంగా చూపాల్సి ఉంటుందని, సొసైటీలకు వెనక్కి పంపినట్లు చూపితే తమ చేతులకు మట్టి అంటకుండా ఉంటుందని భావించి ఈ విధంగా చేసి ఉంటారని పేర్కొంటున్నారు. గోదాముల్లో తడిసిందని, ఎలుకలు కొట్టాయని వస్త్రాన్ని వెనక్కి ఇచ్చామని చెబుతున్న అధికారులు అదే గోదాముల్లోని వస్త్రాన్ని మాస్కుల కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ వస్త్రం ఎందుకు తడవలేదు? ఎలుకలెందుకు కొట్టలేదు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేకున్నారు.

నివేదిక అడిగారు..

కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని పూర్తిగా నేను చదవలేదు. వెనక్కి పంపిన వస్త్రానికి సంబంధించి వివరాలు ఇవ్వాలన్నారు. వచ్చిన ఆదేశాలను చూసి పూర్తి నివేదిక ఇస్తాం. అప్పట్లో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి గోదాం బాధ్యులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు వచ్చినట్లున్నాయి. ఆ సమయంలో నేను జిల్లాలో లేను. - సోమేశ్వరరావు, ఆప్కో, జిల్లా మేనేజర్‌, కడప


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని