పర్యాటకం...తిరోగమనం
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

పర్యాటకం...తిరోగమనం

ప్రతిపాదనలకే పరిమతమైన అభివృద్ధి పనులు

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

జిల్లాలో సోమశిల వెనుక జలాల్లో ‘వన విహారి’ ఏర్పాటు కోసం 2020 ఆగస్టు 30న అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తొలి విడతలో రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికీ పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాదిలో రూ.కోటి నిధులిస్తామని చెబుతున్నారు కానీ పనులు పట్టాలెక్కలేదు.

సోమశిల వెనుక జలాల ప్రాంతం 22 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. చుట్టూ ఎత్తయిన కొండలు.. కనుచూపుమేర కనువిందు చేసే గిరులు.. ఆహ్లాదం పంచే పెన్నానది.. మధ్యలో చెంగున ఎగిరే జలచరాలు.. నింగి, నేలను తాకేలా విదేశీ విహంగాల విహారం అబ్బురపరుస్తోంది.

బస.. వసతి కొరత

జిల్లాలో ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, కోటలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటి సందర్శనకు వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు. కానీ సందర్శకులు కాసేపు సేద తీరేందుకు, బస చేసేందుకు సరైన వసతి లేదు. గతంలో పర్యటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భవన నిర్మాణాలు నిర్వహణ భారమై నిరుపయోగంగా వదిలేశారు.

అంతర్జాతీయ గుర్తింపు ఏదీ? : పెన్నానది తీరాన అద్భుతమైన చారిత్రక కట్టడానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని కొన్నేళ్లుగా పాలకులు చెబుతున్నారు. ఇది నేటికీ కార్యరూపం దాల్చలేదు. రోప్‌ వే ఏర్పాటు కోసం రూ.6.99 కోట్ల అంచనాలతో చేపట్టారు. సుమారు రూ.2.50 కోట్లు విలువ చేసే పనులు జరిగాయి. ఆనక నిధుల కొరత ప్రగతి పడకేసింది. పనులు ఆగిపోయాయి. కాసుల కష్టంతో ముందుకు సాగలేదు.

ఒంటిమిట్ట, జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే : జిల్లాలో పర్యాటకాభివృద్ధి పడకేసింది. పాలకులు, అధికారులు చెప్పిన పనులేవీ ప్రతిపాదనల దశ దాటనే లేదు. ఫలితంగా ఘనమైన చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు ఎన్ని ఉన్నా పర్యాటక రంగం ప్రగతి బాట పట్టడం లేదు.

ఎన్నెన్నో అవకాశాలు... : కడప గడపన శేషాచలం, పాలకొండలు, వెలిగొండ, నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. లంకమల, పెనుశిల నరసింహ అభయారణ్యాల్లో అరుదైన ఎర్రచందనం విస్తారంగా ఉంది. అపార వృక్ష సంపద, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు మెండుగా ఉన్నాయి. పెన్నానది 167 కి.మీ, చిత్రావతి 20, కుందూ 61, పాపఘ్ని 61, బహుదానది 193 కి.మీ, సగిలేరు 98 కి.మీ, గుంజనేరు 104 కి.మీ పొడవున ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 15 జలాశయాలను నిర్మించారు. కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, చెన్నూరు, వల్లూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, పెద్దముడియం, సిద్దవటంలో 21 ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వీటిలో అపురూప శిల్ప సంపద పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆదరణ లేక కొన్ని శిథిలావస్థలోకి చేరాయి. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో మరో 20 నిర్మాణాలు, రెండు మ్యూజియంలు ఉన్నాయి. కొన్ని దెబ్బతిన్నా బాగు చేయలేదు. నిధుల కొరతతో నవీకరణకు నోచుకోలేదు. ప్రతిపాదనలు పంపినా పచ్చజెండా ఊపలేదు.

జల విహారం.. ఎంతెంత దూరం : జిల్లాలో జలవనరుల శాఖ పర్యవేక్షణలో 15 జలాశయాలు ఉన్నాయి. గండికోట, మైలవరం, పైడిపాళెం, పీబీఆర్‌, బ్రహ్మంసాగర్‌, అన్నమయ్య, వెలుగల్లు, బుగ్గవంక, పింఛ, ఝరికోన తదితర జలాశయాలు బోటు షికారుకు అనుకూలం. ఇవేగాక సోమశిల వెనుక జలాలు నిల్వ ఉన్న ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం, పెనగలూరు, సిద్దవటం మండలాల పరిధిలోని ముంపు గ్రామాలు, పెన్నా, బాహుదా, సగిలేరు, గుంజనేరు పరివాహక ప్రాంతంలో పడవ ప్రయాణం వసతి కల్పిస్తే పర్యాటకులకు ఆహ్లాదం లభిస్తుంది. ఏకశిలానగరి, బద్వేలు, పోరుమామిళ్ల, ఇతర పెద్ద చెరువుల్లోనూ జల విహారానికి అవకాశం కల్పిస్తే సందర్శకుల రద్దీ పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

గండికోట వైపు... సినీరంగం చూపు

నటుడు సత్యరాజ్‌కు సన్నివేశాన్ని వివరిస్తున్న దర్శకుడు రాధాకృష్ణ (దాచిన చిత్రం)

తెలుగు, తమిళ చిత్రాలు గండికోట, మైలవరం జలాశయ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణలు చేపట్టాయి. గతంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో హీరో సునీల్‌, సలోని జంటగా మర్యాద రామన్న చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాలను గండికోట, మైలవరం జలాశయం, అగస్తేశ్వరకోన, ఎర్రగుంట్ల ప్రాంతంలో చిత్రీకరించారు. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో హీరో గోపీచంద్‌, తాప్సీ జంటగా నటించిన సాహసం, యువ కథనాయకుడు రాజ్‌ తరుణ్‌ లవర్‌ సినిమా, ప్రముఖ కథనాయకుడు విజయ్‌ నటించిన సామి-2 సినిమాను దర్శకుడు హరి గండికోటలోని మాధవ రాయస్వామి దేవాలయంలో చిత్రీకరించారు. ఇటీవల రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న రాధేశ్యామ్‌ సినీమాలో భాగంగా మూడు రోజుల పాటు బాహుబలిలో కట్టప్పగా పేరొందిన నటుడు సత్యరాజ్‌పై పలు సన్నివేశాల చిత్రీకరించారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళంలో అగ్రకథనాయకుడు విజయ్‌ నటించిన కత్తి సినిమాను, హాస్యనటుడు సంతానం హీరోగా రెండు సినిమాల చిత్రీకరణ చేశారు.

అద్భుత జలదుర్గం సిద్దవటం : నిత్యజీవనదిగా ప్రవహించే పెన్నానదీ తీరాన కృత్రిమ కాలువను ఏర్పరచి శత్రుదుర్భేద్యమైన జలదుర్గాన్ని మట్లి రాజులు నిర్మించారు అదే సిద్దవటం కోట. విజయనగర రాజులతో వియ్యమందిన ఘనత ఈ వంశస్థులు సొంతం. అనేక పతనాలు చుట్టిముట్టినా నేటికి నాటి వైభవానికి దర్పణంగా కనిపిస్తోంది ఈ కోట. ఇందులో జిల్లా అధికారులు గతంలో రాజుల సంక్షిప్త చరిత్రను తెరకెక్కించి ధ్వని, వెలుతురు ఆట (సౌండ్‌, లైటింగ్‌ ) ఏర్పరచనున్నట్లు ప్రకటించారు. కనీసం ఆ వైపున అడుగులు పడిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

గండికోట వద్ద పెన్నాలోయ సోయగం

నిధులు రాగానే చేపడతాం...

గండికోటలో రూ.6.99 కోట్లతో రోప్‌ వే పనులకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రూ.2.50 కోట్లు ఖర్చు చేశాం. నిధుల కొరత కారణంగా తాత్కాలికంగా ఆగిపోయాయి. త్వరలో పనులను పునఃప్రారంభిస్తాం. మిగతా ప్రాంతాల్లో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - బి.ఈశ్వరయ్య, ఈఈ, పర్యాటకశాఖ, కర్నూలు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం...

జిల్లాలో అద్భుతమైన పర్యటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, జల వనరుల్లో బోటు షికారు వసతి కల్పించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిపాలన అనుమతి రాగానే చేపడతాం. జలాశయాల్లో, సోమశిల వెనుక జలాలు, పెద్ద చెరువుల్లో బోటింగ్‌ వసతి కల్పించాలని యాత్రికులు అడుగుతున్నారు. దీనిపై దృష్టిసారించాం. - పి.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధికారి, పర్యటకశాఖ, కడప


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని