రేపటి నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

రేపటి నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు ప్రాథమిక పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన ప్రశ్నపత్రాలతో వీటిని జరపనున్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకూ పదోతరగతి మినహా అన్ని తరగతులకు పాఠశాల స్థాయిలోనే ప్రశ్న పత్రాలు రూపొందించేవారు. ఇకపై రాష్ట్ర స్థాయి నుంచే ప్రశ్నపత్రాలిస్తున్న నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంపై దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయుల మూల్యాంకనం అనంతరం ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జవాబుపత్రాలను మూల్యాకనం చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. తల్లిదండ్రులకు తప్పనిసరిగా ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్‌ తరగతులను నిర్వహించాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఈ నెల 21న తెలుగు,, 22న ఆంగ్లం, 23న గణితం, 25న ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు 21న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 22న హిందీ, ఫిజికల్‌సైన్స్‌, 23న ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, 25న సంస్కృతం, జీవశాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం డీఈవో వాట్సప్‌ గ్రూపు ద్వారా ఎంఈవోల గ్రూపునకు, వారి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గంట ముందు సాఫ్ట్‌ కాపీల రూపంలో తెలియజేసేలా కార్యాచరణ రూపొందించారు. తరగతి గదిలోని బ్లాక్‌, గ్రీన్‌ బోర్డుపై ప్రశ్నపత్రాలను రాసి పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక రచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యాధికారులు పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నారు. ఈ విషయమై డీఈవో శైలజ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని