బడులు... విలీనం దిశగా అడుగులు
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

బడులు... విలీనం దిశగా అడుగులు


ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత

పాఠశాలలో విలీనం కానున్న రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాల

కడప, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే నెల ప్రారంభం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 240 ఉన్నత పాఠశాలల్లో 285 ప్రాథమిక బడులను విలీనం చేసేందుకు కసరత్తు పూర్తయింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు చదువుతున్న 15,285 మందిని ఉన్నత పాఠశాలల్లోకి తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే తెలుగు మాధ్యమంలో 26,354 మంది, ఆంగ్లం 24,928 మంది, ఉర్దూ విభాగంలో 3,564 మంది చదువుతున్నారు. ఈ మేరకు 200 ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్కటి చొప్పున, మరో 36 పాఠశాలల్లో రెండేసి చొప్పున 72 ప్రాథమిక పాఠశాలలను కలపాలని ప్రతిపాదించారు మూడింట్లో మూడేసి, మరొకటిలో నాలుగు ప్రాథమిక బడులు సమ్మిళతం చేసేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు ఒక యూనిట్‌ ప్రామాణికంగా తీసుకోవాలని ఉన్నతాథికారుల నుంచి ఉత్తర్వులందాయి. ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉంటే ప్రస్తుతం ఉన్న చోటే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో 56,572 మంది ఉంటే కొత్తగా 3, 4, 5 తరగతి విద్యార్థులను 15,285 మందిని విలీనం చేస్తే మొత్తం 71,857 మందికి ఆ సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న చాలాచోట్ల ఒకరు లేదా ఇద్దరూ ఉపాధ్యాయులు ఉంటున్నారు. బహుళ తరగతుల నిర్వహణ, విద్యాబోధనతో అభ్యసన ఫలితాలు ఆశాజనకంగా రావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని సబెక్టులను బోధించడం కష్టంగా ఉందని నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలో ఉన్న 243 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక బడుల గూటికి చేర్చేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ సీనియర్‌ అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని