శిక్షణ దూరం... ఉపాధి భారం
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

శిక్షణ దూరం... ఉపాధి భారం

నిరుపయోగంగా న్యాక్‌ భవనాలు


పులివెందులలో తెరుచుకోని న్యాక్‌ భవనం తలుపులు

-న్యూస్‌టుడే, పులివెందుల పరిశ్రమలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం నిరుద్యోగ యువతలో పెంపొందించి వారికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో జిల్లాలో న్యాక్‌ భవనాలు ఏర్పాటయ్యాయి. అవి నేడు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా వివిధ కోర్సుల్లో శిక్షణ అందిపుచ్చుకుని ఉపాధి బాట వేసుకునే అవకాశాన్ని యువత కోల్పోతోంది. కరోనా ప్రభావంతోపాటు న్యాక్‌ భవనాల పునరుద్ధరణకు అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తు ఆలస్యం వెరసి రెండేళ్లుగా ఈ భవనాల్లో ఎలాంటి శిక్షణ కార్యక్రమాల్లేవు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. మరోపక్క భవనాల నిర్వహణ, సిబ్బందికి వేతనాల చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.

జిల్లాలో పులివెందుల, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో 2008లో న్యాక్‌ భవనాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఎలక్ట్రికల్‌, ఫ్లంబింగ్‌, తాపీమేస్రీ్తీ, పెయింటింగ్‌ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అప్పట్లో 12 వేల మందికి శిక్షణ ఇచ్చి 80 శాతం మందికి ఉపాధి చూపారు. ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇచ్చిన అనుమతి కాలం రెండు నెలల కిందట ముగిసింది. ఈ క్రమంలో యథావిధిగా శిక్షణ తరగతులు కొనసాగించేందుకు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు దరఖాస్తు చేయంలో అధికారులు ఆలస్యం చేయడంతో శిక్షణ తరగతులు కుంటుపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం న్యాక్‌ భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం లేని సమయంలోనైనా ఆయా కోర్సుల్లో శిక్షణ తీసుకుని హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందవచ్చుననే నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. ఏడాదికి సుమారు 1000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది.

నిధుల దుర్వినియోగం

న్యాక్‌ భవనాలల్లో ఒప్పంద పద్ధతిలో 16 మంది టీచింగ్‌, 8 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒకొక్కరికి నెలకు రూ.14 వేల నుంచి రూ.20వేలు వేతనాలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. గత రెండేళ్ల నుంచి ఎలాంటి తరగతులు నిర్వహించకపోయినా వారంతా వేతనాలు పొందుతున్నారు. భవనాల నిర్వహణ ఖర్చులు సైతం ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం

రాకేష్‌, న్యాక్‌ భవనం ఇన్‌ఛార్జి, పులివెందుల

శిక్షణ తరగతులు కొనసాగించేందుకు అనుమతుల కోసం నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు 15 రోజుల కిందట దరఖాస్తు చేశాం. అనుమతులు రాగానే తరగతులు ప్రారంభిస్తాం. ఇప్పటికే నిరుద్యోగ యువతను గుర్తించాం. వారందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక తయారుచేశాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని