పోలీసుల అదుపులో అయిదుగురు స్మగ్లర్లు
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

పోలీసుల అదుపులో అయిదుగురు స్మగ్లర్లు

19 ఎర్రచందనం దుంగల స్వాధీనం


ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న అయిదుగురు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘సిద్దవటం మండలం కనుమలోపల్లె గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా, అయిదుగురిని అరెస్టు చేసి, 19 ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. వీరు దుంగలను బెంగళూరుకు రవాణా చేస్తూ దొరికిపోయారు. కర్ణాటక రాష్ట్రం హోస్కోట్‌ తాలూకా కటిగెనహళ్లి గ్రామానికి చెందిన అతావుల్లాఖాన్‌ అలియాస్‌ అక్రం, మహమ్మద్‌ ఇర్ఫాన్‌, రామాపురం మండలం చిట్లూరు గ్రామానికి చెందిన భోగపతి సందీప్‌(ఇతనిపై ఆరు కేసులున్నాయి), సిద్దవటం మండలం జ్యోతిగొల్లపల్లె గ్రామానికి చెందిన వీరదాసరి మహేష్‌, చలమారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఉదయగిరి ఆదినారాయణను అరెస్టు చేసినట్లు’ ఎస్పీ చెప్పారు. అతావుల్లాఖాన్‌పై పది ఎర్రచందనం కేసులున్నాయి. అతనిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ దేవప్రసాద్‌, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు అమర్‌నాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని