మృత్యుశకటం
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

మృత్యుశకటం

కూలీలపైకి దూసుకొచ్చిన జేసీబీ

ప్రమాదంలో ముగ్గురి మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు


ప్రమాదానికి కారణమైన జేసీబీ

మైదుకూరు, న్యూస్‌టుడే : మహిళా కూలీలపై జేసీబీ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. అప్పుడే వ్యవసాయ కూలీ పనులు ముగించుకుని ఇంటికెళ్లేందుకు రోడ్డుపైకి చేరుకున్న ముగ్గురు మహిళా కూలీలను పొట్టనబెట్టుకుంది. మరో ముగ్గురు మహిళా కూలీలను గాయపరిచింది. మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లె గ్రామసమీపంలో 167బి జాతీయ రహదారిపై గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతులతోపాటు క్షతగాత్రులు మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని కేశలింగాయపల్లెకు చెందినవారు. కేశలింగాయపల్లె మహిళలు ఆదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లె ప్రాంతాలకు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారు. అందులో భాగంగానే గురువారం ఆదిరెడ్డిపల్లె సమీపంలో పొలం పనులకు వెళ్లిన మహిళలు పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి చేరుకున్నారు. వాహనం కోసం ఎదురుచూస్తూ మోరీ రక్షణగోడపై కూర్చున్నారు. అంతలోనే పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న జేసీబీ రక్షణగోడపై కూర్చున్న కూలీలపై దూసుకెళ్లింది. ప్రమాదంలో సింగంశెట్టి మహాలక్షుమ్మ (50), గవ్వల శేషమ్మ (65), గవ్వల పుల్లమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. తుపాకుల వీరమ్మ, బండి పుల్లమ్మ, పసల బాలగురమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ చలపతి, ఎస్‌.ఐ.లు సత్యనారాయణ, మహ్మద్‌రఫి సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మైదుకూరు పురపాలక సంఘం ఛైర్మన్‌ మాచనూరు చంద్ర ప్రమాదంపై ఆరా తీసి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంతో వారివారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతిచెందిన వారిలో మహాలక్షుమ్మ భర్తను కోల్పోయినా కుమార్తెకు వివాహం చేయగా, డిగ్రీ వరకు చదువుకున్న కుమారుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. శేషమ్మకు ఇద్దరు కుమారులు కాగా ఇద్దరికి వివాహమైంది. వారు వేరు కాపురంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. పెద్దకుమారుడు, కోడలు అనారోగ్యంతో మృతి చెందడంతో మనమరాలు బాధ్యతను నెత్తిన వేసుకుని వివాహం చేశారు. పుల్లమ్మకు ముగ్గురు కుమారులు కాగా అందరికీ వివాహమైంది. పెద్దకుమారుడు వ్యవసాయం చేస్తుండగా, రెండో కుమారుడు డ్రైవర్‌గా పనిచేస్తూ మృత్యువాత పడ్డారు. మూడో కుమారుడు ఆర్మీలో ఉన్నారు. గ్రామంలోని ముగ్గురు మహిళలు ఒకేరోజు మృతిచెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

గవ్వల పుల్లమ్మ

గవ్వల శేషమ్మ

సింగంశెట్టి మహాలక్షుమ్మ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని