తల్లీకుమార్తెల దారుణ హత్య
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

తల్లీకుమార్తెల దారుణ హత్య

కడప నగరంలో ఘటన

విభిన్న కోణాల్లో దర్యాప్తు


తల్లీకుమార్తెలు ఖుశీదా, హలీమా (దాచిన చిత్రం)

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప నగరంలోని నకాష్‌వీధిలో నివాసముంటున్న తల్లీకుమార్తెలు ఖుశీదా, హలీమా దారుణ హత్యకు గురైనట్లు కడప అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కడప వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ హుస్సేన్‌ నకాష్‌వీధికి చెందిన ఖుశీదా (47)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గల్ఫ్‌కు వెళ్లి తిరిగొచ్చిన ఈయన ప్రస్తుతం దర్జీ పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు జమీర్‌ (19) డిగ్రీ చదువుతుండగా, కుమార్తె హలీమా (14) 9వ తరగతి చదువుతోంది. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా గత నాలుగేళ్లుగా భర్త మహమ్మద్‌ హుస్సేన్‌ భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరకులు ఇచ్చి వెళుతుంటారు. ‘వీఆర్వో వెంకటసుధాకర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాం. గుర్తు తెలియని దుండగులు తల్లీకుమార్తెలను హత్య చేసినట్లు తెలుస్తోంది. హలీమా గొంతుపై కమిలిన గాయాలున్నాయి. ఖుశీదా గొంతుపై కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ చెప్పారు. తెలిసినవారే హత్య చేసి ఉంటారని, ముందు కుమార్తెను, తరువాత అడ్డొచ్చిన తల్లిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని