బద్వేలు ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు 
eenadu telugu news
Updated : 22/10/2021 06:27 IST

బద్వేలు ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు 

3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

 రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారి విజయానంద్‌


మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘బద్వేలు ఉప ఎన్నిక స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేవిధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 200 ప్రాంతాల్లో 281 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 214 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ముగ్గురు ఎన్నికల పరిశీలకులను నియమించామన్నారు. మొత్తం 14 అంతర జిల్లా తనిఖీ కేంద్రాలు, 9 ప్రత్యేక బృందాలు, ఏడు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 23 పికెట్లు, 20 షాడో పార్టీలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.1.50 కోట్ల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకుని 14 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ప్రచారాలు నిలిపివేయాలని, ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు ఇతర మార్గాల్లోనూ ప్రచారం చేయడానికి వీల్లేదన్నారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఒపీనియన్‌ పోల్‌గానీ, పోల్‌ సర్వేకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానళ్లలో ప్రచారం చేయడం, వెల్లడించడాన్ని నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని, వచ్చే నెల 2వ తేదీన లెక్కింపు ఉంటుందన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ విజయరామరాజుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికలకు సహకరించాలని కోరారు. అనంతరం ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామంటూ రూపొందించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సూచించారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ నవంబరు 1 నుంచి 30 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నందున 2022, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జేసీలు గౌతమి, ధ్యానచంద్ర, డీఆర్వో మాలోల తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని