
ఉప ప్రణాళిక నిధుల కేటాయింపులో వివాదం
ఒకే ప్యాకేజీలో టెండరుకు నిర్ణయం
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపులో నిబంధనలకు తిలోదకాలిచ్చారంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎస్సీ, మహిళా కమిషన్లకు, మానవ హక్కుల సంఘానికి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కేటాయింపుల్లోనే అవకతవకలు జరిగాయంటూ ఇంతటి గందరగోళం నెలకొనగా ఇప్పుడు వాటిని బడా గుత్తేదార్లకు కట్టబెట్టేందుకు పాలకవర్గం, అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం రూ.9.8 కోట్లతో 43 అభివృద్ధి పనులకు పాలకవర్గ తీర్మానం చేయగా వీటిని అలాగే టెండర్లు నిర్వహించాల్సి ఉండగా వీటన్నింటిని ఒకే ప్యాకేజీలో టెండరు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ చీఫ్ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపించడం మరింత వివాదస్పదంగా మారుతోంది. కేవలం భారీ కమిషన్ల కోసం బడా గుత్తేదార్లకు కట్టబెట్టేందుకే అన్ని అభివృద్ధి పనులను ఒకే ప్యాకేజీలో పెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ముక్కలుగా... ఇప్పుడెందుకు గుత్తాగా
ఏదేని అభివృద్ధి పని త్వరితగతిన పూర్తి కావాలంటే ఒకే గుత్తేదారుతో సాధ్యం కాదని భావించి అదే పనిని రెండు, మూడు ముక్కలుగా చేసి టెండర్లు నిర్వహించి గుత్తేదార్లకు అప్పగించేవారు. పనులు వేగవంతం కావడంతో పాటు స్థానిక గుత్తేదార్లకు ఉపాధి కల్పించినట్లయ్యేది. ఆయా అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా నగరపాలక అధికారులదే ఉండేది. దీంతో గుత్తేదార్లు సైతం త్వరితగతిన పనులు పూర్తి చేసేవారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులకు సంబంధించిన 43 అభివృద్ధి పనులను వేర్వేరుగా టెండర్లు పిలిస్తే పలువురు గుత్తేదార్లు పోటీ పడి పనులు దక్కించుకోవడంతో ఎవరికి వారుగా వారికి కేటాయించిన పనులను చేసే అవకాశముంది. ఇప్పుడు 43 పనులను ఒకే గుత్తేదారుకు అప్పగిస్తే పనుల నిర్వహణ ఎలా ఉంటుందో ఊహించవచ్ఛు. దీని వెనక కమీషన్ల బాగోతం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా పలువురు కార్పొరేటర్లు సైతం వ్యతిరేకిస్తున్నారు.
పనులు వేగవంతం కావాలనే...
- మహేందర్, నగరపాలక ఈఈ.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే సంకల్పంతో ఉన్నతాధికారులు, పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. వేర్వేరుగా పనులు అప్పగిస్తే ఒక డివిజన్లో మిగిలిన పనిని మరో డివిజన్లో చేపట్టే అవకాశం ఉండదు. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావులేదు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకే బల్దియా చర్యలు తీసుకుంటోంది.