Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

స్ప్రే ట్రాక్టర్లకు జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌,

కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నగరపాలిక ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. రామగుండం నగరపాలక కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరపాలిక సిబ్బంది నిరంతర సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటూ రామగుండం ప్రాంతాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా నగరంలో వివిధ కాలనీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాలను పిచికారీ చేసేందుకు ప్రత్యేకంగా 12 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనాతో మృతిచెందిన వారి బంధువులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా నగరపాలిక ఆధ్వర్యంలోనే ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు. రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలు తప్పనిసరైతే తప్ప ఇంటిలోంచి బయటకు రావద్దని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచూ చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని కోరారు. నగరపాలికలో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరుతో పాటు హెల్ప్‌లైను ఏర్పాటు చేశామని, నిరంతరంగా పనిచేస్తాయన్నారు. పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన ఉపరితల, భూగర్భ మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తహసీల్దార్‌ కార్యాలయం ముందున్న కొండపైనున్న జలాశయంలో మరోసారి క్లోరినేషన్‌ చేస్తున్నామన్నారు. నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిఫ్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

రసాయన ద్రావణం పిచికారీ ప్రారంభం

కరోనా విజృంభిస్తున్నందున నగరంలోని వివిధ కాలనీల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ప్రారంభించారు. నగరంలోని అన్ని కాలనీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా రసాయన ద్రావణాలను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని నగరపాలక అధికారులను కోరారు. మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని