Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆందోళన వద్దు.. అందుబాటులో సేవలు

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలతోపాటు వైరస్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ చేయడమే తక్షణ కర్తవ్యం. జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్సల పడకలను పెంచడం.. వాటన్నింటికి నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, ఐసోలేషన్‌ కేంద్రాలకు సంబంధించిన విషయాలను ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు.

ఈనాడు: పాజిటివ్‌ వచ్చినవారికి తక్షణ చికిత్సకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

కలెక్టర్‌: జిల్లా ఆసుపత్రితోపాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో రెండోదశ వ్యాప్తితో రోజుకు 1500-2000 వరకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. దీనిలో 4 నుంచి 5 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హోం ఐసోలేషన్‌ కిట్‌లు ఇస్తున్నాం. దీనిలో ఐదు రోజులకు సరిపడా మందులు ఉంటాయి. యాక్టివ్‌ కేసులను స్థానిక ఆరోగ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా సూచించాం. పాజిటివ్‌ వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలోని యాక్టివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు.

ఈనాడు: హోం ఐసోలేషన్‌లో ఉండలేని బాధితుల పరిస్థితి ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో నిరుపేదల కుటుంబాలు, కార్మికవాడల్లో ఇరుకు గదుల్లో అద్దెకుంటున్నవారికి ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వేములవాడలోని లక్ష్మీగణపతి ధర్మసత్రాన్ని వంద పడకల ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చాం. అక్కడ 50 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులు మరింతగా పెరిగితే సర్దాపూర్‌లోని పాలిటెక్నిక్‌, సిరిసిల్లలోని నర్సింగ్‌ కళాశాలలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చే ఆలోచనలో ఉన్నాం.

ఈనాడు: జిల్లా ఆసుపత్రిలో కరోనా ఐసీయూ పడకలు నిండాయి. అత్యవసర చికిత్సలు ఎలా?

కలెక్టర్‌: ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సలకు సిద్ధం చేశాం. ఐసీయూకు కేటాయించిన 50 పడకలు నిండాయి. అదనంగా 60 పడకలకు కేంద్రీకృత ప్రాణవాయువు సరఫరా పైపులు అమర్చి చికిత్సలకు అందుబాటులోకి తెస్తాం. కరోనా బాధితులకు అత్యవసర సమయంలో 12 సాధారణ, 4 హెచ్‌ఎఫ్‌ఎన్‌యూ వెంటిలేటర్లు ఉన్నాయి.

ఈనాడు: ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారా?

కలెక్టర్‌: జిల్లా ఆసుపత్రిలో 102 ప్రాణవాయువు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 వేల లీటర్ల సామర్థ్యంతో ఎల్‌ఓటీ ఉంది. ఆసుపత్రిలో వంద మందికిపైగా ప్రాణవాయువు అవసరం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేవు. అదానీ సంస్థ సామాజిక బాధ్యత నిధులు రూ.25 లక్షలతో ప్రాణవాయువు తయారు చేసే జనరేటర్‌ను అందజేసింది. రెండ్రోజుల్లో దీని బిగింపు పూర్తవుతుంది. దీని ద్వారా గాలి నుంచి ఆక్సిజన్‌ను తయారు చేసుకోవచ్ఛు జిల్లా ఆసుపత్రిలో ప్రాణవాయువుకు కొరత లేకుండా చూస్తున్నాం. శ్వాస సమస్యలున్న ప్రతి బాధితునికి ప్రాణవాయువు అందుబాటులో ఉంటుంది.

ఈనాడు: బాధితులకు అత్యవసర సమయంలో అందిస్తున్న చికిత్సలు చెబుతారా?

కలెక్టర్‌: వ్యాధి తీవ్రతను బట్టి రెమ్‌డెసివిర్‌, క్లైజాన్‌, మిథైల్‌ ప్రెగ్టిజైలోన్‌, ఐవర్‌మిక్సి, డాక్స్‌సైక్లిన్‌ లివో సెట్రజన్‌ తదితర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాం. అవసరాన్ని బట్టి తెప్పిస్తాం. చికిత్సకు మందుల కొరత రానివ్వం. బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు మందులు అందజేస్తారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ.. వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఉండకూడదు. వేములవాడలోని తిప్పాపూర్‌ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్‌ చికిత్స కేంద్రంగా మార్చేలా కసరత్తు చేస్తున్నాం. జిల్లాలో 80 మంది వైద్య సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించాం. అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని తీసుకుంటాం.

ఈనాడు: జిల్లా ప్రజలకు మీరిచ్చే సూచనలు?

కలెక్టర్‌: ప్రభుత్వ ఉద్యోగులు.. 45 సంవత్సరాల పైబడినవారు.. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్‌ తీసుకోవాలి. తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లో వ్యాక్సినేషన్‌లో కొంత వెనకబడి ఉన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా తీసుకొచ్చి టీకా ఇప్పిస్తున్నాం. జిల్లాలో రాత్రి వేళ కర్ఫ్యూ అమలుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం రావాలి. మాస్కులు ధరించడం, విధిగా భౌతిక దూరం పాటించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని