Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంద పడకల ఆసుపత్రి... ఆధునిక వైద్యం

మంత్రి ఆదేశాలతో ప్రారంభానికి సిద్ధం చేస్తున్న యంత్రాంగం

తిప్పాపూర్‌లో పూర్తయిన ఆసుపత్రి భవనం

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వేములవాడ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని తిప్పాపూర్‌లో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. రూ.22 కోట్ల అంచనాలతో తిప్పాపూర్‌లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో దీనికి రూపకల్పన చేశారు. 2017 సంవత్సరంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిల చేతుల మీదుగా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇటీవల ఆసుపత్రి అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు వైద్య సేవలందించాలనే ఉద్దేశంలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. సోమవారం ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ పది రోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాలుగు బ్లాక్‌లున్న ఆసుపత్రిలో కనీసం రెండు బ్లాకులైన వైద్య సేవలందించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. దీంతో ఆసుపత్రిలో ఐసీయూ గది, పది పడకలు, కొవిడ్‌ రోగులకు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఓపీ బ్లాక్‌, కొవిడ్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలు, సామగ్రిని, వైద్య సిబ్బందిని సమకూర్చే పనిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం నిమగ్నమైంది.

గ్రామీణులకు మరింత చేరువ...

వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తే వేములవాడ ప్రాంత పేదలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అన్ని రకాల ఆధునిక వైద్య సేవలందించే లక్ష్యంతో అధునాతనంగా గదులు, సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో నాలుగు బ్లాకులుండగా ప్రస్తుతం రెండింటిలో సౌకర్యాలు కల్పించి వైద్య సేవలందించేందుకు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం వేములవాడలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రి తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో పాటు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో అటు వైద్య సిబ్బందికి, వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తే అన్ని రకాల వైద్య సేవలు అందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతంగా ఉండటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ ఉన్నత శ్రేణి ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో కొవిడ్‌ వైద్య పరీక్షలకు, టీకా కోసం వేల సంఖ్యలో వచ్చిన వారు ఇబ్బందులు పడటంతో టీకా కేంద్రాన్ని సినారె కళా మందిరంలో ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితులలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైతే వేములవాడ ఆసుపత్రిలో రద్దీ తగ్గడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం

- ఆర్‌.మహేష్‌రావు, వైద్యాధికారి, వేములవాడ

తిప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. పది రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అత్యవసర చికిత్సలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. పడకలు, ఐసీయూ, వెంటిలేటర్‌, కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ ప్లాంట్‌, తదితర సౌకర్యాలతో రెండు బ్లాకులను సిద్ధం చేస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని