Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం

మంత్రి గంగుల కమలాకర్‌

ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించి కసరత్తులు చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం 35వ డివిజన్‌ సప్తగిరికాలనీలో రూ.12.5లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్‌ను నగర మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగర, పురపాలికలకు నేరుగా నిధులు కేటాయిస్తున్నారని, నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు సుందరంగా మారుతున్నాయని చెప్పారు. రూ.3.5కోట్లతో 30 చోట్ల ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని డివిజన్లలో వాకింగ్‌ట్రాక్‌లు నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రతిరోజు తాగునీటి సరఫరా విజయవంతమైందన్నారు. 24గంటల నీటి కోసం డీపీఆర్‌లు తయారు చేశామన్నారు. రూ.100కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌ నిర్మాణ పనుల్లో చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయని, నెలన్నరలోగా తీగల వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. కరోనా సంక్షోభంలో కూడా నిధులు వెచ్చించి పనులు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ చేస్తే చర్యలు

గతేడాది కరోనాను కట్టడి చేశామని, సెకండ్‌ వేవ్‌ను కూడా అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. మందులు, రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని, ఎప్పటికప్పుడూ కోటా వచ్చేలా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారంతా టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు పాజిటివ్‌ రావడం బాధాకరమని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అవసరమైన కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రైవేటు టీచర్లకు సన్నబియ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గతేడాది మార్చి 20వ తేదీ వరకు పని చేసిన టీచర్లందరికీ లబ్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సమావేశంలో కమిషనర్‌ వల్లూరు క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, కార్పొరేటర్లు సీహెచ్‌.బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్‌, ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ రామన్‌, డీఈఈ ఓంప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని