వలసల గడ్డకు సమున్నత స్థానం
eenadu telugu news
Published : 20/05/2021 04:13 IST

వలసల గడ్డకు సమున్నత స్థానం

టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా చంద్రశేఖర్‌రావు


ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చంద్రశేఖర్‌రావు (పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: వలసల గడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. కొలువుల కోసం కొట్లాడిన ఉద్యమానికి ఊపిరిలూదిన నేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమున్నత స్థానం కల్పించారు. జిల్లాకు చెందిన వైద్యుడు ఎర్రవెల్లి చంద్రశేఖర్‌రావును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యునిగా నియమించారు. రాష్ట్రంలో సమర్థులైన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.

జిల్లాలో ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లోని వ్యవసాయ కుటుంబానికి చెందిన ఎర్రవెల్లి చంద్రశేఖర్‌రావు పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. పై చదువులకు విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లారు. ఉస్మానియాలో బీఏఎంఎస్‌ పూర్తి చేశారు. తొలుత సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెడికల్‌ ప్రాక్టీసు ప్రారంభించారు. తర్వాత 1986లో ముస్తాబాద్‌లో నర్సింగ్‌హోంను ప్రారంభించి భార్య అనురాధతో కలిసి సేవలందిస్తున్నారు. ముస్తాబాద్‌ చుట్టుపక్కల సంచారజీవులు, అనాథలకు తమ ఆసుపత్రి నుంచి ప్రత్యేకంగా హెల్త్‌కార్డులు జారీ చేశారు. ఈ కార్డుతో వచ్చినవారికి కన్సల్టేషన్‌ రుసుము ఉండదు. 20 ఏళ్లుగా వృద్ధులకు సేవలందిచేందుకు గాను నవజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దుబ్బాకలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన నాటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పరిచయం ఏర్పడింది. దుబ్బాక, సిరిసిల్ల రెండు నియోజకవర్గాల్లోని ప్రజలతో సన్నిహిత సంబంధాలు, సేవా ధృక్పతం ప్రజల్లో చెరగని ముద్రవేసింది.

రాజకీయ ప్రస్థానం

విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలున్న చంద్రశేఖర్‌రావు క్రమశిక్షణకు మారుపేరు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో తెలంగాణ, సీమాంధ్ర వైద్యులను ఒకటి చేసి రాష్ట్ర ఆవిర్భావ ప్రాముఖ్యతపై సమావేశాలు నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించారు. 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014లో తెరాసలో చేరి ముస్తాబాద్‌ జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత వైద్యసేవలకు పరిమితమయ్యారు.

కుటుంబ నేపథ్యం

భార్య అనురాధ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతరు వంశీప్రియ అమెరికాలో ఎంఎస్‌ ఫిజీషియన్‌గా.. చిన్నకూతురు శశిప్రియ హైదరాబాద్‌లో గైనకాలజిస్టులో ఇన్‌పెర్టిలిటీ విభాగంలో పనిచేస్తున్నారు.

యువతలో ఉత్సాహం నింపుతా

-ఎర్రవెల్లి చంద్రశేఖర్‌రావు, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు

రాష్ట్రంలోని యువత నైరాశ్యంలో ఉన్నారు. వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడంలో నా భాగస్వామ్యం ఉంటుంది. యువతను చైతన్యవంతం చేసి వారిలో ఉత్సాహం నింపేలా కృషి చేస్తాను. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరించి మెరిట్‌ ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని