త్వరలో కోనసీమలా సిరిసిల్ల: కేటీఆర్‌
logo
Updated : 16/06/2021 15:06 IST

త్వరలో కోనసీమలా సిరిసిల్ల: కేటీఆర్‌

సిరిసిల్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి

సిరిసిల్ల: పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని.. ప్రతి ఇల్లు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాచర్ల బొప్పాపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు  ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

పైసా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ స్థాయిలో ఇక్కడ గజం భూమి రూ.లక్ష పలుకుతోందని... అయినప్పటికీ ప్రభుత్వం ఇక్కడ పేదలకు ఇళ్లు నిర్మించిందన్నారు. రూ. కోట్లు విలువైన భూముల్లో ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇళ్లు కేటాయిస్తామన్నారు. పేదవారి ముఖంలో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నల్లా ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు. త్వరలో 4.7 లక్షల రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం నీటితో సిరిసిల్ల త్వరలో కోనసీమలా మారబోతోందన్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో రూ.కోటి నిధులతో త్వరలో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని