గులాబీ హోరు.. కాషాయం జోరు
logo
Published : 18/06/2021 02:20 IST

గులాబీ హోరు.. కాషాయం జోరు

అప్పుడే ఎన్నికల వాతావరణం

వాడివేడీగా హుజూరాబాద్‌ నియోజకవర్గం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

* ఓవైపు.. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, కోరుకంటి చందర్‌, చల్లా ధర్మారెడ్డి, పోలీసు హౌజింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌లు.. ఆయా మండలాల్లో సమీక్షలు.. సమావేశాలతో తెరాస శ్రేణుల్లో జోష్‌ను నింపారు.
* మరోవైపు.. మాజీమంత్రి ఈటల రాజేందర్‌, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, భాజపా రాష్ట్రనాయకులు వివేక్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఈటల సతీమణి జమునారెడ్డి, మాజీ జడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, భాజపా లీగల్‌సెల్‌ నాయకురాలు ప్రసన్నలు.. తమ రోడ్‌షోలతో జనాల మన్ననల్ని పొందారు.

గురువారం ఒక్కరోజులో హుజూరాబాద్‌లో ఎన్నికల రణరంగమనేలా వాతావరణం కనిపించింది. జేజేలు.. నినాదాలతో అన్ని మండలాలు మారుమోగాయి. పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకేలా ఎవరికి వారుగా హోరెత్తించేలా జోరుని చూపించారు. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనేలా.. ప్రచారం కళ్లముందనేలా పరిస్థితులు ఇక్కడి ప్రజలకు తారసపడ్డాయి. ఇప్పటి వరకు గత కొన్ని రోజులుగా తెరాస ముఖ్య నాయకులు ఇక్కడే మకాం వేస్తూ తమ రాజకీయ చతురతను చూపిస్తుండగా.. దిల్లీలో కాషాడపు కండువాను కప్పుకుని తన నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చిన ఈటల తనదైన పోరుబాటను రోడ్‌షోల రూపంలో చూపించారు. ఓ వైపు ఆయన.. మరోవైపు ఆయన సతీమణి జమునారెడ్డిలు వేర్వేరు కార్యక్రమాలతో రాజకీయవేడిని పుట్టించారు. ఇక ఇటు కమలనాథుల్లో తొలిసారిగా కాషాయపు జెండాలు గతానికి భిన్నంగా రెపరెపలాడటం.. మరోవైపు గులాబీ జెండాలు.. తెరసా అనుకూల నినాదాలు మారుమోగడంతో అసలైన రాజకీయ యుద్ధం ప్రారంభమైందనే తీరు స్పష్టంగా ఇక్కడి ప్రజలకు తెలిసింది. ఇక సరికొత్త సమరానికి సై అంటున్నాయి.
ఈటల ఇంటింటికి..
మరో మూడు, నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండనున్న ఈటల రాజేందర్‌ ఆయా గ్రామల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆశీస్సుల్ని అందుకునేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. సమావేశాల నిర్వహణకు ముందర ఇక్కడి ప్రజలకు తనకు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు ఇంటింటి యాత్రకు సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగానే రోజుకు మూడు నాలుగు గ్రామాల్లో పర్యటించబోతున్నారు. ఇదే సమయంలో భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు రాష్ట్రస్థాయి నాయకులు కూడా వరస పర్యటనలతో ఇక్కడి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్ని చేయబోతున్నారు.  
అభివృద్ధి జపంతో..
గత వారం రోజులనుంచి జోరుని పెంచుతున్న అధికార తెరాస హుజూరాబాద్‌ పురపాలికపై ప్రధాన దృష్టిని పెడుతోంది. ఇక్కడ వారం రోజుల్లోనే ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా అభివృద్ధిని అందించేందుకు ఆగమేఘాల మీద నిధుల్ని అందించింది. రోడ్లను వేయడంతోపాటు పలు సమస్యల పరిష్కారం దిశగా చొరవను చూపిస్తోంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్యనాయకులతో సమీక్షలు జరుపుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ పక్షాన నిలబడి అభ్యర్థిని గెలిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే భరోసాను నింపుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని