నీటి కలుషితం..వ్యాధులతో సతమతం
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

నీటి కలుషితం..వ్యాధులతో సతమతం

● అతిసారం బాధితులతో ఆసుపత్రుల్లో రద్దీ

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ఇటీవలి వర్షాల కారణంగా కలుషితమయిన తాగునీరు, దుర్గంధం వెరసి రామగుండం ప్రాంతంలో వారం రోజులుగా వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రితో పాటు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలు అధిక సంఖ్యలో వ్యాధుల బారిన పడుతున్నారు. టైఫాయిడ్‌, అతిసారం, డెంగీ తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కొన్ని కాలనీల్లో నగరపాలక సంస్థ తాగునీటితో పాటు ఇటీవల కొద్ది రోజులుగా సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్న నీరు కలుషితం కావడం వల్లేల ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు పందులు, దోమల బెడద తీవ్రంగా ఉంది.

దోమల బెడద... తాగునీటి కలుషితం

పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలోని కొన్ని ప్రధాన కాలువల్లో మురుగు తొలగించిన బల్దియా గల్లీల్లోని కాలువలను పట్టించుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో దుర్వాసనతో పాటు దోమల బెడద తీవ్రంగా ఉంది. కాలువల్లో పందులు పొర్లుతూ మురుగు ప్రవాహానికి అడ్డుపడుతుండడం మరో సమస్యగా మారింది. అడ్డగుంటపల్లి, మారుతినగర్‌తో పాటు నగరంలోని కొన్ని కాలనీల్లో నగరపాలక కుళాయిల్లో మురుగు నీరు వస్తుందనే ఆరోపణలున్నాయి. తాగునీరులో మురుగు ఎక్కడ కలుస్తుందో కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది. సింగరేణి సరఫరా చేస్తున్న నీరు కలుషితం కావడంతో ఆయా కాలనీల్లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరం వచ్చిందంటే చాలు ఆయా కుటుంబాల్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సమస్య పరిష్కారానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక దశలోనే నివారణ చర్యలకు పూనుకోవాల్సి ఉంది.

గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కొద్ది రోజుల కిందటి వరకు రోజుకు వందమంది మాత్రమే సాధారణ వైద్య పరీక్షల కోసం(ఓపీ) ఆస్పత్రికి వస్తుండగా ఇప్పుడు రోజుకు 300కు పైగా ఓపీ ఉంటోంది. స్థానిక ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ రోజుకు 20 వరకు ఉండే ఓపీ ఇప్పుడు సుమారు 100కు చేరుకుంది. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ఆస్పత్రిలోని సాధారణ వ్యాధులకు సంబంధించిన వార్డులో 5 నుంచి 10 మంది మాత్రమే ఉంటుండగా ఇప్పుడు ప్రతి రోజు 30 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా వార్డులో చేరుతున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతమున్న సాధారణ వార్డు సరిపోకపోవడంతో ‘కోవిడ్‌’ ఐసోలేషన్‌ కేంద్రం కోసం ఉంచిన వార్డును సైతం వినియోగంలోకి తెచ్చారు.


అవసరమయిన ఏర్పాట్లు చేస్తున్నాం

గత కొద్ది రోజులుగా జ్వరాలతో పాటు ఇతర సాధారణ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని రకాల వ్యాధులకు మందులు సిద్ధంగా ఉన్నాయి. . ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమల వాలకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలి.

- డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని