రామగుండం పోలీసు కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

రామగుండం పోలీసు కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

● సీపీ నియామకంలో నాటకీయ పరిణామం

● రాత్రికి రాత్రే అధికారి మార్పు

గోదావరిఖని, న్యూస్‌టుడే: రామగుండం పోలీసు కమిషనర్‌ నియామకంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రికి రాత్రే అధికారులను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా రామగుండం పోలీసు కమిషనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా మళ్లీ తెరపైకి సంగారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు జీఓ విడుదల చేశారు. ఇక్కడ రమణకుమార్‌ కంటే సీనియర్‌ పోలీసు అధికారులు కొంత మంది పనిచేస్తుండటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్జలరీ పదోన్నతులపై నాన్‌కేడర్‌ ఎస్పీ ర్యాంకుకు చేరుకున్న రమణకుమార్‌ కమిషనర్‌గా పనిచేస్తే ఆయన కింద సీనియర్లు పనిచేయాల్సిన అవకాశం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం డీఐజీ హోదాలో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని నియమించడం ద్వారా సీనియర్ల నుంచి ఇబ్బందులు ఉండవన్న ఆలోచనతోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ ర్యాంకు నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీ హోదాకు చేరుకున్న రమణకుమార్‌ ఆయన కంటే ముందు ఎస్‌ఐ బ్యాచ్‌లో పనిచేస్తున్న వారితో పాటు ఐపీఎస్‌ అధికారి కూడా కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

విధుల్లో నిబద్ధతకు గుర్తింపు

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి నిబద్ధతతో పోలీసు విధులు నిర్వహిస్తారనే పేరుంది. గ్రూపు-1 పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన ఈయన పోలీసు శాఖలో డీఎస్పీగా 1994లో బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన చంద్రశేఖర్‌రెడ్డి కోసావోలో యు.ఎన్‌.పీస్‌(యుగోస్లావియా)లో ఏడాది పాటు పనిచేశారు. క్రమశిక్షణ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన సంగారెడ్డిలో ఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అక్కడే డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన త్వరలో ఐజీ పదోన్నతుల జాబితాలో ఉన్నారు. రామగుండం పోలీసు కమిషనర్‌గా నియమించడానికి ఆయన హోదాతో పాటు క్రమశిక్షణ గల అధికారిగా గుర్తింపు దక్కించుకోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు సౌమ్యంగా పనిచేయించుకోవడంలో ఆయన ప్రత్యేకత అని తెలిసింది.


వ్యక్తిగతం...

పేరు : ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి

పుట్టిన తేదీ : 08.09.1968

తండ్రి పేరు : ఎస్‌.పర్వతరెడ్డి

తల్లి పేరు : యాదమ్మ

పుట్టిన గ్రామం : తిమ్మరిషిపల్లె, కల్వకుర్తి మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

విద్యాభ్యాసం : ప్రాథమిక విద్య స్వగ్రామం, కల్వకుర్తి

ఉన్నత విద్య : బీఈ సివిల్‌(సీబీఐటీ), గండిపేట, హైదరాబాద్‌

పోలీసు ఉద్యోగం : 1994లో గ్రూపు-1 ద్వారా డీఎస్పీగా బాధ్యతలు

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ కమిషనరేట్‌లో అల్వాల్‌ డీసీపీ, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా విధులు

ఎస్పీ : కర్నూలు, నిజామాబాద్‌, మెదక్‌, ప్రస్తుతం సంగారెడ్డిలో విధులు..


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని