‘ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా పాలన’
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

‘ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా పాలన’

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే తెలంగాణ కావాలని ఉద్యమిస్తే ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక కన్వీనర్‌ గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. కరీంనగర్‌లో గురువారం నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా సదస్సు సన్నద్ధత సమావేశాన్ని బుధవారం పెద్దపల్లిలోని అమర్‌చంద్‌ కల్యాణమండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 352 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాలు, అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఆత్మగౌరవం కాపాడుకోవాలనే ఆశయంలో జరిగిన పోరాటానికి ప్రస్తుత పాలన తీరుతో అర్థం లేకుండా పోతోందన్నారు. మరో కన్వీనర్‌ పాశం యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనకు బదులు నిర్వహణ జరుగుతోందన్నారు. గోదావరి, కృష్ణా జలాలు పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సి.సత్యనారాయణ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆర్‌.మోహన్‌, వేముల రామూర్తి, గంట రాములు, డొంకెన రవీందర్‌, మర్వాడి సుదర్శన్‌, శ్రీమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని