అంగన్‌వాడీలకు అద్దెల దరువు
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

అంగన్‌వాడీలకు అద్దెల దరువు

 

● పేరుకుపోతున్న బకాయిలు

● తప్పని ఆర్థిక భారం

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఇదీ గోదావరిఖని అశోక్‌నగర్‌ అంగన్‌వాడీ కేంద్రం. నెలకు అద్దె రూ. 3,000, విద్యుత్తు, నల్లా బిల్లు కలుపుకొని మరో రూ.500 మొత్తం రూ.3500 అద్దె చెల్లించాల్సింది ఉంది. ఏడాది నుంచి అద్దె బిల్లులు రావడం లేదు.

మంథని పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లోని కేంద్రం. ఇప్పటివరకు నెలకు రూ.వెయ్యి చెల్లించేది. ప్రస్తుతం మంథని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతో అద్దె పెరిగింది. దాదాపుగా ఏడాదిన్నరగా అద్దె చెల్లింపునకు నోచుకోలేదు.

మాతా శిశు మరణాలను తగ్గించి.. పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికల్లో పోషక విలువలు పెంపడంలో కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంగన్‌ వాడీ కేంద్రాలకు అద్దెల కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలో 706 కేంద్రాలు ఉండగా వీటిలో అధికంగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాథమిక పాఠశాల, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. సగానికిపైగా కేంద్రాలకు సొంత వసతి లేకపోవడంతో అద్దె భారమవుతోంది. ప్రతి నెల అద్దె సొమ్ము విడుదల చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంటి యజమానుల ఒత్తిడి తట్టుకోలేక అంగన్‌వాడీ టీచర్లు సొంత డబ్బులను చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకే సరిపోతుండగా అద్దె సొమ్ము భారమవుతుందని తలలు పట్టుకుంటున్నారు.

నెలకు రూ. 6.41 లక్షలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో అద్దె భవనాల చెల్లింపులో పలు రకాల స్లాబ్‌లు అమలవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 3-4 వేల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. వెయ్యి కేటాయిస్తున్నారు. జిల్లాలోని 313 అద్దె కేంద్రాలు ఉండగా వీటిలో పట్టణ ప్రాంతాల్లో 164, గ్రామీణ ప్రాంతాల్లో 149 కేంద్రాలకు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. నెలకు రూ. 6.41 లక్షల అద్దె భారమవుతోంది. మంథని, పెద్దపల్లి ప్రాజెక్టుల పరిధిలో గత ఏడాది 15, రామగుండం పరిధిలో 18 నెలల అద్దె మంజూరుకావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.1.23 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సకాలంలో బడ్జెట్‌ నిధులు కేటాయించకపోవడంతో అద్దె చెల్లింపులో జాప్యం నెలకొందని టీచర్లు ఆరోపిస్తున్నారు.

ఇరుకు భవనాలు, అరకొర వసతులు

జిల్లాలో పెద్దపల్లి, మంథని రామగుండం ప్రాజెక్టు పరిధిలో 220 సొంత భవనాలు, 175 ప్రాథమిక పాఠశాల, ఇతర ప్రభుత్వ సముదాయాలు, 313 అద్దె భవనాల్లో నిర్వర్తిస్తున్నారు. చాలా చోట్ల ఇరుకు గదులు, అరకొర వసతుల్లో నెట్టుకొస్తున్నారు. చిన్నారులకు సరిపడా వెలుతురు లేకపోవడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నరగా కేంద్రాలు తెరుచుకోవడం లేదు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5549 గర్బిణులు, 4887 బాలింతలు, ఏడాదిలోపు 4183, ఏడాది నుంచి మూడేళ్లలోపు 17,146 ఆరేళ్లలోపు 16,713 మొత్తం 48,478 మందికి ప్రతి నెల పౌష్టికాహార సామాగ్రి అందిస్తున్నారు.

విడతల వారీగా విడుదల: లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అద్దె సొమ్ము మంజూరులో కొంత జాప్యం వాస్తవమే. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. బిల్లులు వచ్చిన వెంటనే భవనాలకు చెల్లిస్తున్నాం.


అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాలు

ప్రాజెక్టు మున్సిపల్‌ గ్రామీణం మొత్తం

పెద్దపల్లి 21 84 105

మంథని 10 45 55

రామగుండం 133 20 153


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని