కోతల కథలు.. ఎన్నాళ్లీ వ్యథలు..
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

కోతల కథలు.. ఎన్నాళ్లీ వ్యథలు..

మూడున్నరేళ్లుగా కాలనీలకు నిత్యయాతన

నగరంలో కొనసా..గుతున్న విద్యుత్తు పనులు

కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో విద్యుత్తు ప్రగతి పనులు..

ఏందీ.. సార్‌ ఎంతసేపటికి వస్తది కరెంట్‌. అరె రోజు గిట్ల గంటల తరబడి విద్యుత్తును తొలగిస్తే పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులకు.. ఇతర పనులకు కష్టమైతుంది. రోజు మా కాలనీ కాకుండా వేరే చోట కూడా తీయండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తీసేస్తమన్నరు. ఇప్పుడు 2 దాటింది అయినా.. ఇంకా పవర్‌ రాలేదు. - విద్యుత్తు అధికారితో నగర పౌరుడి వేదన

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ఒకటి కాదు రెండు కాదు మూడున్నరేళ్లుగా నగర ప్రజలను విద్యుత్తు కోతల తీరు నరకయాతన చూపిస్తోంది. ప్రగతి పనుల పేరిట కొనసా..గుతున్న పనులు పూర్తవకపోవడంతో నిత్యం పలు కాలనీలకు విద్యుత్తు అంతరాయం వాటిల్లుతోంది. పక్కా ప్రణాళిక లేకపోవడం.. ఎవరు అడుగుతారనే నెపంతో ఇష్టానుసారమనే తీరు నగర పాలక సంస్థ పరిధిలో కనిపిస్తోంది. సుమారు 80వేలకుపైగా నివాసాలున్న నగరంలో నిత్యం ఎంతలేదన్నా 2వేలకుపైగా కుటుంబాలు కోతల కష్టాల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా విద్యుత్తు సరఫరా వ్యవస్థలోని లోపాల్ని సవరించడం, కొత్త తీగల్ని అమర్చడం, స్మార్ట్‌ సిటీలో అదనపు వసతుల కోసం చేపట్టే పనులకోసం ఇలా సరఫరాను నిలుపుతున్నారు. రోజుకు సగటున 5 గంటలు లెక్కేసినా నెలలో కనిష్ఠంగా 25రోజులపాటు తీస్తున్నారు. దీంతో ఒక్క మాసంలో ఎంతలేదన్నా 125 గంటలపాటు సరఫరా ప్రజలకు దూరమవుతుంది.

ఇలా ఇబ్బందికరమే.!

నగరంలో పవర్‌వీక్‌ ప్రోగ్రామ్‌ రెండో దశలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు 910 స్పాన్‌ లైన్లను గుర్తించి వాటిని పునరుద్ధరించారు. ఇక 531 పక్కకు ఒరిగిన స్తంభాలను గుర్తించినా ఇందులో ఇప్పటి వరకు 337 స్తంభాలను మాత్రం సరిచేశారు. మిగతా వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మరో 1296 స్తంభాల విషయంలో ఒకింత సమస్య ఉన్నట్లు గమనించినా ఇందులో ఇప్పటి వరకు కేవలం 94 కొత్తవి వేశారు.

* స్మార్ట్‌సిటీ పనుల నెపంతో చీటికిమాటికి విద్యుత్తును నిలిపివేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐదుగంటల పాటు తొలిగించే విద్యుత్తు వల్ల పనులు జరిగే కాలనీలతోపాటు విద్యుత్తు ఉప కేంద్రం ఉన్న ఏడెనిమిది కాలనీలకు సరఫరా నిలిచిపోతోంది. పైగా ఒకటి రెండు చోట్లనే నింపాదిగా పనులు చేస్తుండటంతో ఒక రోజులో జరగాల్సిన పని రెండు మూడు రోజులకు వాయిదా పడుతున్న సందర్భాలున్నాయి.

* సమీకృత విద్యుత్తు అభివృద్ధి పథకం (ఐపీడీఎస్‌) కార్పొరేషన్‌ పరిధిలో సబ్‌ ట్రాన్స్‌మిషన్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకుగానే గతంలో మంజూరైన రూ.9.86కోట్లతో అవసరమైన పనుల్ని చేపడుతున్నారు. ఇవి దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ అనుకున్న విధంగా ఇవి జరగకపోవడం వల్ల విద్యుత్తు సరఫరా విషయంలో తరచూ అంచనాలకు మించిన అంతరాయం జరగడంతో విద్యుత్తు వినియోగదారులంతా నష్టాల్ని ఎదుర్కొన్నారు.

* బైపాస్‌ మార్గంలోని పద్మానగర్‌లో 132/33 కేవి విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మిస్తుండటంతో అనుసంధానంగా విద్యుత్తు తీగల్ని వేస్తుండటంతో జాప్యం జరుగుతోంది. పట్టణ ప్రగతి పనులు కూడా అక్కడక్కడ చేస్తున్నామని విద్యుత్తు అధికారులు చెబుతున్నా వాటిని ఒక ప్రణాళిక ప్రకారం మరమ్మతు చేయించకపోవడంతో అదనపు సమయం వృథా అవుతోంది. కార్మికులు పనిప్రదేశానికి రాకున్నా కోతల సమయపాలనను మాత్రం ఠంచనుగా పాటిస్తున్నారు.

* హరితహారంలో భాగంగా ఆయా కాలనీల్లో చెట్లను తొలగించే సమయంలోనూ గంటల తరబడి కోత తప్పడంలేదు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో ఇది అనివార్యమే అయినా.. ఎలాగు ఇబ్బంది తమది కాదనేలా పలువురు సిబ్బంది వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని