ఎల్లలు దాటిన ప్రతిభ
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

ఎల్లలు దాటిన ప్రతిభ

చదరంగంలో గ్రాండ్‌మాస్టర్‌గా మంథని కుర్రాడు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

గెలిచిన టైటిళ్లతో రుత్విక్‌

మంథని పట్టణానికి చెందిన రాజవరం రాజారుత్విక్‌ చరిత్ర సృష్టించాడు. చదరంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ నెగ్గాడు. శనివారం హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన వెజిర్‌కెపీజో గ్రాండ్‌మాస్టర్‌ చెస్‌ టోర్నమెంట్‌లో 17 ఏళ్ల రాజారుత్విక్‌ చెకోస్లోవియా దేశానికి చెందిన ఫినెక్‌ వాక్లావ్‌పై నెగ్గాడు. తెలంగాణ నుంచి ఈ టైటిల్‌ను సాధించిన వారిలో మూడో వ్యక్తిగా, దేశంలో 70వ గ్రాండ్‌మాస్టర్‌గా రుత్విక్‌ గుర్తింపు పొందాడు. దిగ్గజ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్‌ఆనంద్‌ స్ఫూర్తితో రుత్విక్‌ ఆరేళ్ల వయసు నుంచి చదరంగంలో సాధన చేస్తున్నాడు. వీరి కుటుంబం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటోంది. రుత్విక్‌ హైదరాబాద్‌లోని సైనిక్‌పురి భారతీయ విద్యాభవన్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. తండ్రి రాజవరం శ్రీనివాస్‌ ట్రాన్స్‌కోలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌గా, తల్లి దీపిక ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. సోదరి హారిక బెంగళూరుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రుత్విక్‌ ఇప్పటివరకు 25 దేశాల్లో చదరంగ పోటీలకు హాజరయ్యాడు. ఏషియన్‌, కామన్వెల్త్‌, వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ పాల్గొన్నాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించాడు. 2011లో ఏపీలోని భీమవరంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచి అదే ఏడాది పుణేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. అనంతరం గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌పై గురిపెట్టిన రుత్విక్‌ ఇందుకు అనుగుణంగా విదేశాల్లో పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు. ప్రస్తుతం గ్రాండ్‌మాస్టర్‌గా గెలుపొందిన రుత్విక్‌ భవిష్యత్తులో సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదాను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని అతని తండ్రి శ్రీనివాస్‌ ‘ఈనాడు’కు తెలిపారు. రుత్విక్‌ సాధించిన విజయంపై మంథనిలోని బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

చెకోస్లోవియా దేశానికి చెందిన ఫినెక్‌ వాక్లావ్‌తో తలపడుతున్న రాజా రుత్విక్‌ (పాతచిత్రం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని