నిర్మాణాల్లోనే.. మార్కెట్లు
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

నిర్మాణాల్లోనే.. మార్కెట్లు

కోరుట్ల, న్యూస్‌టుడే

గడి బురుజు వద్ద రోడ్డుపై కూరగాయల విక్రయాలు

కోరుట్ల పట్టణంలో రోడ్లపైన, ఆరుబయట కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్‌లు ఉండటంతో రైతులు, అమ్మకందారులు, ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం కూరగాయల, మాంసం విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన అధునాతన మార్కెట్‌లు ఏళ్ల తరబడి నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి.. 2019 జూన్‌లో పట్టణంలోని నందిచౌక్‌ వద్ద 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.150 లక్షలతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు రూ.కోటితో మార్కెట్‌ భవనం స్లాబ్‌ పోసి పనులను మధ్యలోనే వదిలేశారు. స్లాబ్‌ కింద అడుగులోతో వర్షపు నీరు నిలవడంతో కుంటలా మారింది. ఐదు నెలలుగా ఎలాంటి పనులు చేపట్టకపోగా ఇంకా రూ.50 లక్షల రూపాయలతో పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మించిన స్లాబ్‌పై మరో స్లాబ్‌, గోడల నిర్మాణానికి ఈ నిధులు సరిపోకపోవడంతో ఇంకో రూ.కోటి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించి, పనులు పూర్తిస్థాయిలో చేపట్టి మార్కెట్‌ ఎప్పుడు అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో తెలియకుండా మారింది.

కల్లూర్‌రోడ్‌లో కొనసాగుతున్న పనులు

పట్టణంలోని కల్లూర్‌రోడ్‌లో టీయూఎఫ్‌ఐడీసీ ఫేస్‌-2 నిధులు రూ.25 లక్షలతో నూతన కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. ఈ నిధులతో రేకుల షెడ్డుతో కూడిన మార్కెట్‌ పనులు చేపట్టారు. ఇంకా రంగులు అద్దాల్సి ఉంది. దాని ముందుభాగంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న షెడ్లు, ప్రహరీ, గేట్‌ నిర్మించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి మరిన్ని నెలలు పట్టనుంది.

రోడ్లపైనే విక్రయాలు

కోరుట్ల పట్టణంలో సుమారు లక్ష జనాభా ఉంటుంది. వీరి సౌకర్యార్థం పట్టణంలో ఎలాంటి కూరగాయల, మాంసం విక్రయ మార్కెట్‌లు లేవు. గడి బురుజు వద్ద రోడ్డుపై, గోదాం ఏరియాలో రోడ్లపైనే కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసి రైతులు, దుకాణదారులు విక్రయించడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపై దుకాణాలు ఉంచడంతో ఎండకు, వర్షానికి, దుమ్ముకు, వాహనాల రాకపోకల నడుమ నిత్యం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇవేకాక కొత్తబస్టాండ్‌ వద్ద రోడ్డుపైనే బండ్లపై కూరగాయలను అమ్ముతుంటారు. మాంసం విక్రయించేందుకు ప్రత్యేక మార్కెట్‌ సౌకర్యం కల్పించకపోవడంతో రోడ్లుపైన ఎక్కడ దొరికితే అక్కడే మాంసంను విక్రస్తుంటారు. గోదాం ఏరియాలో నిర్మించిన చేపల విక్రయ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేరు. గడి బురుజు వద్ద రోడ్డుపైనే చేపలను విక్రయిస్తున్నారు. పట్టణ జనాభాకు అనుగూనంగా పట్టణ నలుమూలల మార్కెట్‌ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైన ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని