శత శాతం హాజరు లక్ష్యం
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

శత శాతం హాజరు లక్ష్యం

జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి

పదిలో మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తాం

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా బోధన

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

‘కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షల నిర్వహణను సవాల్‌గా తీసుకున్నాం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా మౌలిక వసతులను మెరుగుపరుస్తాం. వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని అందరికీ నాణ్యమైన విద్య అందిస్తాం.’ అని జిల్లా విద్యాశాఖ అధికారిణి దేశ్‌పాండే మాధవి పేర్కొన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆమెతో ‘ఈనాడు’ మాట్లాడింది.

ఈనాడు: ప్రత్యక్ష బోధన ప్రారంభమై పక్షం దాటింది. విద్యార్థుల హాజరు మెరుగుపడిందా?

డీఈవో: కరోనా మహమ్మారి మూలంగా విద్యార్థులు 18 నెలల పాటు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. టీశాట్‌, ఇతర మాధ్యమాల ద్వారా పాఠాలు విన్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతుల వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో మొత్తం విద్యార్థులు 32,869 మంది ఉండగా 20,606 (62.69 శాతం) మంది పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ నెల 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతోంది. 80 శాతం మంది పిల్లలు బడికి వస్తున్నారు. అది 100 శాతానికి చేరుకునేలా కృషి చేస్తున్నాం.

ఈ: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఏం చేయనున్నారు?

డీఈవో: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఏటా శాసనసభ నియోజకవర్గ నిధులు(ఏసీడీపీ) కేటాయిస్తోంది. ఇందులో ఎక్కువ శాతం పాఠశాలలకే కేటాయించాలన్న నిబంధనలున్నాయి. ఈ మేరకు జిల్లాలోని పాఠశాలల్లో అవసరమైన భవనాలు, అదనపు తరగతి గదులు, వసతిగృహాలు, ప్రయోగశాలలు, ప్రహరీలు, మూత్రశాలలు తదితర వసతులపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించాం. ఈ మేరకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

ఈ: పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడటానికి ప్రత్యేక ప్రణాళిక ఏమిటి?

డీఈవో: పదో తరగతిలో 2017-18లో 86.55 శాతం(రాష్ట్ర స్థాయిలో 16వ స్థానం), 2018-19లో 87.16 శాతం(15వ స్థానం) ఉత్తీర్ణత నమోదైంది. కరోనా కారణంగా 2019-20, 2020-21 సంవత్సరాల్లో 100 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఈ సారి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటాం. వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని సన్నద్ధం చేస్తాం. విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి వారితో ఉపాధ్యాయులు చర్చలు నిర్వహించడం ద్వారా పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా చర్యలు తీసుకుంటాం. సిలబస్‌ త్వరగా పూర్తయ్యేలా ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు, పునశ్చరణ తరగతులు నిర్వహిస్తాం.

ఈ: ఉపాధ్యాయుల హాజరు, సిలబస్‌ పూర్తయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీఈవో: జిల్లాలో 2,200 మంది ఉపాధ్యాయులుండగా 95 శాతం మంది కొవిడ్‌ నియంత్రణ టీకా తీసుకున్నారు. ఇప్పటికే వీరందరూ పాఠశాలలకు హాజరవుతున్నారు. త్వరలో బయోమెట్రిక్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటించాలి. క్రమం తప్పకుండా హాజరై సకాలంలో సిలబస్‌ పూర్తి చేసేలా పర్యవేక్షిస్తాం. ఈ విద్యాసంవత్సరానికి అనుగుణంగా సిలబస్‌ నిర్వహణపై ఇంకా ప్రభుత్వ మార్గదర్శకాలు రాలేదు.

ఈ: ఇప్పటికీ కొందరు తల్లిదండ్రులు బడికి పంపడానికి జంకుతున్నారు? వారికి ఎలాంటి భరోసానిస్తున్నారు?

డీఈవో: జిల్లాలో 358 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 104 ఉన్నత, 10 కేజీబీవీలు, 7 ఆదర్శ పాఠశాలల పరిధిలో 28 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 174 ప్రైవేటు పాఠశాలల్లో 52 వేల విద్యార్థుల వరకున్నారు. ఆయా పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయ సిబ్బంది, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తల్లిదండ్రుల్లో మనోధైర్యం నింపుతున్నాం. ఉపాధ్యాయులు, సిబ్బంది టీకా తీసుకున్నారని, పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని అవగాహన కల్పిస్తున్నాం. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుంటే పరీక్షలు చేయించి సమాచారం ఇస్తున్నాం. ప్రతి విద్యార్థి విధిగా మాస్కు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని