వణికిస్తున్న దోమ
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

వణికిస్తున్న దోమ

నిల్వ నీరు, పారిశుద్ధ్యలోపంతో వ్యాధుల విజృంభణ

నెల రోజుల్లో 18 డెంగీ కేసులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

దోమలు విజృంభిస్తున్నాయి. రెప్ప పాటులో రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రోజరోజుకు జ్వరపీడితులు పెరుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా డెంగీ లక్షణాలతో పాటు మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా కేసులు ఉంటున్నాయి. జిల్లా వైద్యఆరోగ్యశాఖ సేకరించిన వివరాల ప్రకారం ఈ నెలలో 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో మిగతా వారు ప్రైవేటులో చికిత్స పొందారు. వైద్యఆరోగ్యశాఖ లెక్కకు చిక్కనవి వందల్లో ఉంటాయని అంచనా.

అంతర్గత రహదారులు, కల్వర్టులు శిథిలమై నిలిచిన మురుగు

సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘాల్లోని విద్యానగర్‌, అంబేడ్కర్‌నగర్‌, వెంకట్రావ్‌నగర్‌, సుభాష్‌నగర్‌, శాంతినగర్‌, బీవైనగర్‌, సంకెపల్లి, రుద్రంగి, అనంతనపల్లి, తండగొండ, వెంకట్రావ్‌పల్లి, కొండాపూర్‌, శివంగలపల్లి, కనగర్తి, కంచర్ల, చంద్రంపేట గ్రామాల్లో వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. పురపాలక సంఘాలు, పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధుల నుంచి పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించుకునే వీలుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, నల్లా గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పట్టణాల్లోని ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి విపరీతంగా ఉంటుంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని నాలుగు ఫాగింగ్‌ యంత్రాలకు రెండే పని చేస్తున్నాయి. నీరు నిల్వ ఉన్నచోట లార్వా నివారణ చర్యలను విస్మరించారనే విమర్శలున్నాయి. ఏటా దోమల నివారణకు పురపాలక సంఘాలు, పంచాయతీల్లో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. సీజన్‌లో తిరిగి అవే ప్రాంతాల్లో సమస్యలు పునరావృతం కావడం గమనార్హం.

నిల్వ నీటిలో దోమల వృద్ధి

లెక్కలోకి వచ్చేవి కొన్నే...

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి జ్వరపీడితులు అధికంగా ఆసుపత్రులకు వస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరి కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ ప్రత్యేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతున్నందున వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నారు. ఇందులో విషజ్వరాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 2018లో తీవ్రస్థాయిలో డెంగీ, విషజ్వరాలు నమోదయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా.. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నవారు ఉన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేవు. దీంతో ఆ పేరు చెప్పకుండా వైరల్‌ జ్వరాల పేరుతో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- డాక్టర్‌సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

జిల్లాలో డెంగీ నిర్ధారణ అయిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందంచే చుట్టుపక్కల వారికి వైద్య పరీక్షలు చేశాం. కాలానుగుణ వ్యాధులను నియంత్రణలోకి తెచ్చేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాన్ని నియమించాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పూలకుండీలు, కూలర్లు, నీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించాలి. డెంగీ కారక దోమలు ఇళ్లల్లో మూలలు, తలుపు, కిటికీల తెరల్లో దాగి ఉంటాయి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండటం వల్ల కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేయాలి. దోమ తెరలు వాడాలి.

పూర్తి నివారణ ఎప్పుడు?

దోమల వల్ల వచ్చే మలేరియా, గన్యా వంటి వ్యాధుల నివారణకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రూ.10 వేల కోట్లు కేటాయించింది. 2030లోపు మలేరియాను పూర్తిగా నిర్మూలించేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో మూడేళ్లలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ మండలాల్లో దోమలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో ఇల్లంతకుంట మండలం పొత్తూరులో డెంగీ దోమను కనుగొన్నారు. ఏటా అవే ప్రాంతాల్లో వ్యాధులు వ్యాప్తిస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని