ఫలకానికి ఏడాది.. పనుల జాడేది!
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ఫలకానికి ఏడాది.. పనుల జాడేది!

 సమీకృత గొర్రెలు, మేకల విపణి నిర్మాణంలో జాప్యం

 మూలుగుతున్న రూ.25 లక్షల నిధులు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

2020 సెప్టెంబరు 20న యార్డుకు శంకుస్థాపన చేసిన మంత్రులు తలసాని, కొప్పుల

బ్యాంకులో నిధులు మూలుగుతున్నా జీవాల మార్కెట్‌ యార్డు నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. రాష్ట్రంలోనే ఆదర్శమైన సమీకృత జిల్లా గొర్రెలు, మేకల విపణి నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 20న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అంతర్గాం మండలం కుందన్‌పల్లిలో శంకుస్థాపన చేశారు. కాగా సంవత్సరమవుతున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు.

తూకం పద్ధతిలో క్రయవిక్రయాలు చేపట్టి పెంపకందారుల సంక్షేమానికి పాటుపడాల్సిన అధికారులు కరోనాతో గుత్తేదారులు ముందుకు రావడం లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారు. గొల్ల, కుర్మల ఆర్థికాభ్యున్నతి కోసం ప్రభుత్వం రాయితీ గొర్రెల పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే ఒకటో విడత పూర్తి కాగా రెండో విడత పంపిణీకి ప్రకటన చేసింది. ఇప్పటికైనా జిల్లా పాలనాధికారిణి సర్వే సంగీత స్పందించి టెండర్లు ఆహ్వానించాలని పెంపకందారులు కోరుతున్నారు.

కూడళ్లలోనే సంత నిర్వహణ

కుందనపల్లిలో మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన స్థలంలో కాపరులు తాత్కాలిక షెడ్లు నిర్మించి క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. కరోనా కారణంగా జీవాల రవాణా ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో కొద్ది రోజులకే మూసివేశారు. ఇక్కడ కాపలాగా ఉంటున్న కాపరులు పనుల్లేక ఖాళీగా ఉంటున్నారు. 4.5 ఎకరాల్లో రూ.25 లక్షలతో సమీకృత గొర్రెలు, మేకల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించగా తరచూ కలెక్టర్లు మారుతుండటం, ఫైళ్లపై సంతకాలు, టెండర్లకు ఆహ్వానం ప్రక్రియలు వాయిదా పడుతున్నాయి. ప్రత్యేక విపణి లేకపోవడంతో జిల్లాలో పెద్దపల్లి-మంథని వంతెన కింద, మండలకేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో జీవాల సంత నిర్వహిస్తున్నారు. కాపరుల సమస్యలు చూసి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యార్డులో తాత్కాలికంగా వేసిన షెడ్డు

రాయితీ పథకంతో గొర్రెల వృద్ధి

రాయితీ గొర్రెల పథకాన్ని జిల్లాలో 2017 జూన్‌ 20న ప్రారంభించారు. మొదటి విడతలో 21,110 మంది సభ్యులతో 197 సంఘాలు ఏర్పడ్డాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. 2017-18లో 5,110 యూనిట్లు, 2018-19లో 5113 యూనిట్లు కలిపి మొత్తం 10,223 యూనిట్లను 10,600 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2019-20లో ఎన్నికలు, కరోనా కారణంగా గొర్రెలు పంపిణీ చేయలేదు. 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన ఒక యూనిట్‌ వ్యయం రూ.1.25 లక్షలు. ఇందులో రూ.31,250 లబ్ధిదారు సమకూర్చుకోవాల్సి ఉండగా, రూ.93,750 ప్రభుత్వం రాయితీ కింద సమకూరుస్తుంది. మొదటి విడతలో 2,14,683 గొర్రెలను పంపిణీ చేయగా ప్రస్తుతం వాటి సంతతి 5,64,000కు పెరిగింది. రెండో విడతలో 10,545 యూనిట్లు పంపిణీ చేసే అవకాశముంది.

సమన్వయ లోపమే శాపం

జీవాల మార్కెట్‌ యార్డుకు ఏడాది కిందట శంకుస్థాపన చేయగా టెండర్లు పిలవడం, గుత్తేదారులకు సమాచారం అందించడం, నోట్‌ఫైల్‌ తయారీ, కలెక్టర్‌ వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంచడం వంటి చర్యలతోనే సంవత్సర కాలం గడిచింది. మార్కెట్‌ యార్డును నిర్మించే పనిని పంచాయతీరాజ్‌(ఇంజినీరింగ్‌) శాఖకు అప్పగించారు. ఆ శాఖ నుంచి ఈ శాఖకు ఫైళ్లు, చెక్కులు తిరగడం తప్ప నిర్మాణం పనులు ఇంకెప్పుడు ముందుకు జరుగుతాయో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అక్టోబరులో అని పశుసంవర్ధక శాఖ అధికారి, నవంబరులో జరుగుతాయని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని