జల వీలయానికి
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

జల వీలయానికి

నేటికి అందని పరిహారం..

నాయకుల హామీలు.. నీటిమీద రాతలే

మల్యాల, న్యూస్‌టుడే


మ్యాడంపల్లిలోని ఎస్సీ కాలనీలో నీటమునిగిన ఇళ్లు (పాత చిత్రం)

సరిగ్గా అయిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల శివారులోని కాకతీయ ప్రధాన కాలువకు గండిపడటంతో మానాల, మ్యాడంపల్లి గ్రామాల రైతులకు చెందిన దాదాపు 500ఎకరాల విస్తీర్ణంలో పంటపొలాలు, మ్యాడంపల్లిలో 30మందికి చెందిన ఇళ్లు నీట మునిగి తీవ్రంగా నష్టపోయారు. అయినా ఇప్పటికీ బాధితులకు పైసా పరిహారం అందలేదు. 2016 సెప్టెంబరు 20న ఉదయం 6గంటల సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా, నేతల సూచన మేరకు అధికారులు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంవల్ల ప్రాజెక్టుకు 88కి.మీ దూరంలోని మానాల శివారులోగల డిస్ట్రిబ్యూటర్‌ 65వద్ద కాకతీయ కాలువకు భారీ గండి పడింది. దాదాపు 40మీటర్ల వెడల్పుతో పడ్డ గండి కారణంగా భారీగా నీటి ప్రవాహం సమీపంలోని పంటపొలాలను ముంచెత్తి చెరువులను నిండు కుండల్లా మార్చింది. రెండు గంటల్లోనే మానాల, మ్యాడంపల్లి గ్రామాలు నీట మునిగి కొట్టుకుపోయాయి. వరిపొలాల్లో రెండడుగుల మందంతో ఇసుక మేటలు వేశాయి. విద్యుత్తు మోటార్లు, స్తంభాలు కొట్టుకుపోయాయి. మ్యాడంపల్లిలో 30 ఇళ్లు నీట మునగడంతో 160కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. గ్రామానికి వెళ్లే దారి మధ్యలోని వంతెన కొట్టుకుపోయింది. సంఘటన జరిగిన తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు, కేంద్రబృందం ఆయా పార్టీల నేతలు నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కేంద్ర బృందం సభ్యులు ఓ అడుగు ముందుకేసి ఎకరా పంట నష్టానికి రూ.50వేల వరకు అందజేస్తామని వెల్లడించారు. కానీ ఇంతవరకు బాధిత రైతులకు నష్ట పరిహారం అందజేయలేదు. నీట మునిగిన కొన్ని ఇళ్లకు తాత్కాలిక సాయం అందజేశారు. ఆరేళ్ల క్రితం మానాల గ్రామంలో వడగళ్ల వానకు వందల ఎకరాల్లో మామిడి, వరి నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందకపోవడంతో వారికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కాకతీయ కాలువ గండి మరోసారి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

పంటపొలాలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసిన దృశ్యం (పాత చిత్రం)


ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం

గాతం అంజయ్య, రైతు

ఐదేళ్ల క్రితం కాకతీయ కాలువకు గండిపడటంతో వరద ప్రవాహంలో రెండెకరాల్లో పండించిన వరిపంట కొట్టుకుపోయింది. పొలమంతా ఇసుక మేటలు వేయడంతో తొలగించడానికి నెలల తరబడి కష్టపడ్డాం. మోటార్లు బావిలోనే కూరుకుపోయాయి. ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చిన్నప్పటికీ ఇప్పటి వరకు పైసా అందక ఆర్థికంగా కోలుకోలేకపోతున్నాం.


అధికారులు వచ్చే వరకు ఇసుక మేటలు తొలగించవద్దన్నారు

చీకట్ల అశోక్‌, రైతు

జరిగిన పంట నష్టాన్ని ఉన్నతాధికారులు వచ్చి అంచనా వేసే వరకు పంటపొలాల్లో మేట వేసిన ఇసుకను తొలగించవద్దని మండలంలోని అధికారులు చెబితే తొలగించకుండా ఒక పంట కూడా వేసుకోలేదు. నాకున్న 4 ఎకరాల పొలంలో 2 బావులు, మోటార్లు పూడుకుపోయాయి. అడుగు మందం ఇసుక మేట వేసింది. కేంద్రం బృందం అధికారులు ఎకరాకు రూ.50వేల వరకు చెల్లిస్తామంటే ఆశతో ఎదురు చూశాం. కానీ ఎలాంటి పరిహారం రాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని