ఆ రసీదులు చెల్లవా!
eenadu telugu news
Updated : 20/09/2021 12:21 IST

ఆ రసీదులు చెల్లవా!

ఆస్తిపన్ను చెల్లించిన వారిలో ఆందోళన

అక్రమాల బాగోతానికి బాధ్యులు ఎవరు?

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ నగరపాలక కార్యాలయం

* నగరానికి చెందిన ఆర్‌.పద్మ ఇం.నెం.4-2-82 ఆస్తిపన్ను బకాయి ఉండగా తేదీ.4.4.2018న అప్పటి బిల్‌ కలెక్టర్‌ రావడంతో తేదీ.1-4-2018 నుంచి 31.3.2019వరకు రూ.4,634చెల్లించి రసీదు(118197) తీసుకున్నారు. ఆ సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడం పూర్తయింది.

* ఆర్‌.శ్రవణ్‌కుమార్‌ ఇం.నెం.4-2-124పై ఆస్తిపన్ను రూ.7050 ఉండగా నగరపాలిక బిల్‌ కలెక్టర్‌కు చెల్లించి రసీదు(118199)అందించారు. పన్ను చెల్లించడం పూర్తి కావడంతో నిశ్చింతగా ఉన్నారు.

* గత కొన్నేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించడం లేదని, బకాయిలు వెంటనే చెల్లించాలని నగరపాలక తరఫున నోటీసులు అందడంతో ఇంటి యాజమానులు ఆందోళనతో కార్యాలయానికి పరుగులు పెట్టారు. అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు.

2018 ఏప్రిల్‌లో బిల్‌ కలెక్టర్‌ ఇచ్చిన రసీదు ఇదే

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను, నల్లా బిల్లులను అర్ధ సంవత్సరానికి, ఏడాదికి ఒకసారి వసూలు చేస్తున్నారు. బిల్లులు స్వీకరించేందుకు నగరపాలికలో రెవెన్యూ విభాగం పని చేస్తోంది. నగరంలో 18 రెవెన్యూ వార్డులు ఉండగా బిల్‌ కలెక్టర్లు ఇంటింటా తిరుగుతూ, నగరపాలికలోని కౌంటర్‌ ద్వారా పన్నుల వసూలు చేయడం జరుగుతుంది. 2017-18 సంవత్సరం నుంచి ఆస్తిపన్నును ఆన్‌లైన్‌, స్వైపింగ్‌ యంత్రం వినియోగించారు. ప్రస్తుతం హ్యాండ్‌ మిషన్‌ ద్వారా రసీదు బిల్లులు ఇస్తుండగా ఏడాది కిందట వెలుగులోకి వచ్చిన అక్రమాల బాగోతంపై ఇంటి యజమానులకు ఇప్పుడిప్పుడే తెలియడంతో లబోదిబోమంటున్నారు. నగరపాలిక పంపించిన బిల్‌ కలెక్టర్‌కు ఆస్తిపన్ను చెల్లిస్తే..వారు జారీ చేసిన రసీదునే చెల్లదంటూ అధికారులు తేల్చి చెప్పడం గందరగోళానికి దారి తీస్తోంది.

సొంతానికి వాడుకుని..

ఆస్తిపన్ను వసూళ్లు చేసేందుకు నగరపాలిక స్వైపింగ్‌ మిషన్‌ ఉపయోగించుకుంటుండగా 2017 కంటే ముందు జారీ చేసిన రసీదు పుస్తకాలు కొందరి దగ్గర నుంచి తీసుకోలేదు. వాటిని అలాగే వారి దగ్గర ఉంచుకోగా ఆ రసీదు పుస్తకాలు ఉపయోగించి ఆన్‌లైన్‌, స్వైపింగ్‌ మిషన్‌తో కాకుండా ఇంటి యజమానులకు రసీదులు జారీ చేశారు. అయితే పన్నులు వసూలు చేసిన తర్వాత వాటిని కార్యాలయ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేయకుండా రూ.లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. ఒకటెండ్రు ఇళ్లకు కాదు..వందల సంఖ్యలో రసీదులు ఇవ్వగా నమోదు కాకపోవడంతో ఇటీవల కొందరు ఇంటి యజమానులు ఫిర్యాదులు చేశారు. పన్నులు చెల్లించినట్లు రసీదులు ఉండగా మళ్లీ చెల్లించాలని అని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టిన రూ.వేల మొత్తానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయ ఉద్యోగులు మాత్రం బకాయిలు ముందుగా చెల్లించాలని, ఆ తర్వాత సర్దుబాటు అయితే చేస్తామని చెప్పి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

రికవరీ సరే..

ఆస్తిపన్ను గోల్‌మాల్‌ చేసిన బిల్‌ కలెక్టర్లపై గతేడాది విచారణ చేపట్టి రూ.56లక్షల మేర రికవరీ చేశారు. దీనికి బాధ్యులైన బిల్‌ కలెక్టర్లను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. రికవరీ చేసిన మొత్తంలో ఇంటి యజమానులకు సంబంధించిన ఆస్తిపన్ను ఉండగా అందులో రసీదుల ద్వారా వసూలు చేసిన మొత్తానికి వివరాలు లేవని చెబుతున్నట్లు తెలిసింది. ఓ వైపు భవన యజమానులు చెల్లించినట్లుగా రసీదులు ఉన్నాయి. వీటిని తీసుకొని ఒరిజినల్‌ రసీదు అవునా? కాదా? అని కూడా తేల్చడం లేదు. రిజిస్టర్‌లో నమోదు కాలేదని ఒకే ఒక సాకు చూపుతుండగా ఇంటి యజమానుల నుంచి వసూలు చేసిన మొత్తానికి లెక్కలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ రసీదు పుస్తకాలతోనే రూ.7.66లక్షలు అక్రమాలు జరిగాయని ఇటీవల ఆడిట్‌ నివేదికలో కూడా గుర్తించారు. సంబంధించిన లెక్కలు కార్యాలయంలో జమ కాలేదని, అలాంటప్పుడూ పన్ను చెల్లించినట్లు ఎలా అవుతుందని నగరపాలిక ఉన్నతాధికారి చెప్పారు. ఇంటి యజమానులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని