అద్దె భవనాలు.. ఎన్నాళ్లీ అవస్థలు
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

అద్దె భవనాలు.. ఎన్నాళ్లీ అవస్థలు

సమస్యలతో సతమవుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు
మరమ్మతులు చేపట్టడంలోనూ జాప్యమే
జగిత్యాల విద్యానగర్‌, న్యూస్‌టుడే

అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

జిల్లాలో సగం వరకు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో వసతులు, సౌకర్యాల కొరత కారణంగా లబ్ధిదారులతో పాటు, నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల మంజూరు ప్రధాన కారణంగా మారిన నేపథ్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల తీరుపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

జిల్లాలో 532
రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు దాటినప్పటికీ, జిల్లాలో సగానికి పైగా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 1035 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటిలో 28 వరకు మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 273 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో మరో 260 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. తక్కిన 532 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
* సొంత భవనాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న అద్దె భవనాల్లోనే కేంద్రాలను వెళ్లదీస్తున్నారు. ఇరుకు గదులకు తోడు, గాలి, వెలుతురు తగినంత లేకపోవడం, తాగునీటికి శాశ్వత పరిష్కారం సమస్యగా మారింది. దీనికి తోడు భవనం అద్దె కూడా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారుతున్నప్పటికీ, శాశ్వత భవనాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ జాప్యంపై అటు పర్యవేక్షకులు, ఇటు నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
* జిల్లాలో సొంత భవనాలకు మరమ్మతులు చేపట్టడంలోనూ జాప్యం నెలకొంది. మొత్తం 168 కేంద్రాలకు తక్షణం మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అసంపూర్ణంగా నిలిచిపోయిన మరో 39 కేంద్రాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది నిధుల మంజూరు లేక అందుబాటులోకి రావడం లేదు.


ప్రతిపాదనలు.. రూ.4.35 కోట్లు

అసంపూర్ణ అంగన్‌వాడీ కేంద్రాలు, మరమ్మతుల చేపట్టాల్సిన కేంద్రాలకు నిధుల కోసం ఇటీవల జిల్లా సంక్షేమశాఖ, జిల్లా పరిషత్తుకు ప్రతిపాదనలు సమర్పించింది. అభివృద్ధిలో 38 కేంద్రాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.1.84 కోట్లు, 168 కేంద్రాల మరమ్మతులకు మరో 2.51 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సమర్పించింది.


ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కారానికి కృషి
డాక్టర్‌ బి.నరేశ్‌కుమార్‌, జిల్లా సంక్షేమాధికారి

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో స్థానిక మంత్రి, శాసనసభ్యుల సహకారంతో సత్వరం సొంత భవనాల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా 138 కేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో స్థలాలను గుర్తించాం. వీటికి నిధుల కోసం జిల్లా కలెక్టర్‌ ద్వారా పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని