ఎన్నాళ్లీ అవస్థలు?
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

ఎన్నాళ్లీ అవస్థలు?

తెగిన తాత్కాలిక రోడ్లతో నిలిచిన రాకపోకలు

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే


బందనకల్‌-బంజర్‌పల్లె మధ్య తెగిన రహదారి

* బందనకల్‌ శివారులో బంజర్‌పల్లెకు వెళ్లే రోడ్డు వంతెన వద్ద తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దచెరువు నుంచి వచ్చే మత్తళ్ల కాల్వ వరద ఉద్ధృతికి రహదారి తెగిపోయింది. బందనకల్‌ నుంచి బంజర్‌పల్లె మీదుగా మాచాపూర్‌, నారాయణరావుపేట, సిద్దిపేట జిల్లా కేంద్రానికి ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏడాది క్రితం వరద ఉద్ధృతికి తెగిపోగా మరమ్మతులు చేశారు. వరద ప్రవాహానికి తిరిగి రోడ్డు తెగిపోవడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు వాగులపై నిర్మించిన తాత్కాలిక వంతెనలు, రోడ్లు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. దీంతో రైతులు, వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పొలాల వద్దకు కాలినడకన వెళ్లేందుకు కూడా కష్టంగా ఉందని అన్నదాతలు వాపోతున్నారు. నిత్యం పంట పొలాల వద్దకు వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగిన తాత్కాలిక రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్ది-సేవాలాల్‌తండా మధ్య నక్కవాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి తెగిపోయింది. సేవాలాల్‌తండా, తెర్లుమద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం చేపట్టగా నిధుల లేమితో వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సేవాలాల్‌తండా గ్రామస్థులు విద్యుత్తు ఉప కేంద్రం మీదుగా మండల కేంద్రానికి తక్కువ దూరంతో రావాలంటే నక్కవాగు దాటాల్సిందే. రోడ్డు తెగిపోవడంతో మండల కేంద్రానికి చేరుకోవాలంటే పోత్గల్‌ మీదుగా దాదాపు అయిదు కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పొలాల వద్దకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సేవాలాల్‌తండా-తెర్లుమద్ది మధ్య ఇలా...

* తెర్లుమద్దికి గోకవాడకు మధ్యలో లోతువాగు ఉంది. దీనిపై తాత్కాలికంగా పైపులు వేసి వంతెన నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇది కొట్టుకుపోయింది. పైపులు చిందరవందరయ్యాయి. గోకవాడ కాలనీవాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో కూడా ఇదే మాదిరిగా రోడ్డు కొట్టుకుపోయింది. పక్కా కాజువే నిర్మిస్తే తప్ప సమస్య తీరని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


త్వరలో పనులు చేపడతాం

- వై.సుదర్శన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ

ఇటీవల కురిసిన వర్షాలకు తెగిన తాత్కాలిక రోడ్లు, వంతెనలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. తెర్లుమద్ది-సేవాలాతండా మధ్య నక్కవాగు వంతెన మరమ్మతులకు రూ. 5లక్షలు, కోదాటివాని పల్లె నిమ్మవారిపల్లె ఆవునూర్‌ గ్రామాల మధ్య తెగిన వంతెనకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. త్వరలో పనులు చేపడతాం. తెర్లుమద్ది-గోకవాడ లోతువాగు, బందనకల్‌-బంజర్‌పల్లె మధ్య వంతెన బాగు కోసం రూ. 5 లక్షల చొప్పున ప్రతిపాదనలు పంపించాం. వారం రోజుల్లో నిధులు మంజూరు కావచ్ఛు నిధులు రాగానే పనులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరిస్తాం. తెర్లుమద్ది-సేవాలాల్‌తండా మధ్య తెగిన నక్కవాగుపై పక్కా వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే రూ.1.17 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని