ప్రతిపాదనలకే పరిమితం
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

ప్రతిపాదనలకే పరిమితం

పట్టణ శివారు వార్డుల్లో అధ్వానంగా పరిస్థితి

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే


బొజ్జపల్లిలో సీసీ రోడ్డు వేసి కాలువ నిర్మాణం వదిలేసిన దృశ్యం

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణంలోని శివారు కాలనీల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే వీధుల్లో ప్రజలు నడవలేని పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో పట్టణాన్ని కలుపుకొని శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి, నాంపల్లి, కోనాయిపల్లి, తిప్పాపూర్‌ విలీన గ్రామాలున్నాయి. ఇందులో మొత్తం 28 వార్డులుండగా ముఖ్యంగా పట్టణ శివారులోని వార్డుల్లో చాలా వరకు సీసీ రోడ్డు, మురుగు కాలువలు లేక వీధుల్లో మురుగు పారుతోంది. పలు వీధుల్లో ఖాళీ స్థలాల్లో మురుగు నిలుస్తోంది. విలీన గ్రామాల్లోనూ ఏళ్లు గడుస్తున్న కాలువలు, సీసీ రోడ్లకు నోచుకోవడం లేదు. ఫలితంగా చాలా వీధులు చిన్నపాటి వర్షం కురిస్తే బురదమయంగా మారుతున్నాయి. దీంతో ఆయా వీధుల్లో ప్రజలు కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణ శివారు వార్డుల్లోనే కొత్త కాలనీలు, ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా నివాస ప్రాంతాల్లోని మురుగు వెళ్లేందుకు కాలువలు లేక వీధుల్లో పారుతోంది. చాలా వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకున్న నాథుడు లేడు.


మల్లారం రోడ్డులో మురుగు

ఏళ్లు గడుస్తున్నా...

పట్టణంలో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. మున్సిపల్‌ మెంటినెన్స్‌ ఇంటర్నల్‌ రోడ్లు (ఎంఎంఐఆర్‌) నిధులు, ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్‌ నిధులు అరకొరగా విడుదలవుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో వీధుల్లో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం కావడం లేదు. ఇటీవల ఎస్సీ గ్రాంట్‌ నిధులతో అక్కడక్కడ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపట్టినప్పటికి ఇంకా చాలా ప్రాంతాల్లో నిర్మించాల్సి ఉంది. మురుగు వీధుల్లో పారి గుంతలు ఏర్పడుతున్నాయి. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. శివారు కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా తయారై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ నడి బొడ్డున నిత్యం రోగులు, వారి బంధువులు, వాహనాలతో రద్దీగా ఉన్న శివసాయి నగర్‌లో రోడ్డు గుంతలమయం కావడంతో అవస్థలు తప్పడం లేదు. సీసీ రోడ్డుకు ప్రతిపాదన చేసి సంవత్సరాలు తరబడినా మోక్షం లభించలేదు. పట్టణంలోని సాయినగర్‌, మల్లారం రోడ్డు, కోరుట్ల రోడ్డు, మార్కెట్‌ ఏరియా, విలీన గ్రామాల్లోనూ చాల శివారు కాలనీల్లో కాలువలు, సీసీ రోడ్లు నిర్మించడం లేదు. అక్కడక్కడ కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించి నిధులు సరిపోక కాలువల నిర్మాణం వదిలేసిన ప్రాంతాలున్నాయి. ఇప్పటికైనా పురపాలక యంత్రాంగం స్పందించి కాలువులు, సీసీ రోడ్డు నిర్మించి మురుగు సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.


నిధులు మంజూరైతే పనులు చేస్తాం

- శ్యామ్‌సుందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

పట్టణంలో పలు అభివృద్ధి పనులకు దాదాపు రూ. 20 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పట్టణ శివారులోని చాలా వరకు కొత్త కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవు. ఎక్కడెక్కడ అవసరమవుతాయనేది గుర్తించి అంచనాలు రూపొందించాం. నిధులు మంజూరైతే సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని