సంతోష్‌ హత్యకేసును ఛేదించిన పోలీసులు
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

సంతోష్‌ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితుల అరెస్టు


జమ్మికుంటలో వివరాలు వెల్లడిస్తున్న సీపీ సత్యనారాయణ

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే : జమ్మికుంట మండలంలో సంచలనం సృష్టించిన సంతోష్‌ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులు కుక్కల రాజ్‌కుమార్‌, పల్లవి (సంధ్య)ని అరెస్టు చేశారు. జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌ గ్రామానికి చెందిన కుక్కల రాజ్‌కుమార్‌కు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మౌనికతో వివాహం జరగగా వీరికి ఒక బాబు ఉన్నాడు. ఆ తరువాత రాజ్‌కుమార్‌కు నాగరాజు భార్య పల్లవితో పరిచయం ఏర్పడగా ఆమెను తిరుపతిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. రాజ్‌కుమార్‌ మొదటి భార్య మౌనిక చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టగా రాజ్‌కుమార్‌ను పోలీసులు పిలిపించగా సమయంలో సంతోష్‌ వెళ్లి మౌనికకు మద్దతుగా మాట్లాడారు.అప్పటి నుంచి కక్ష పెంచుకున్న నిందితులు రాజ్‌కుమార్‌, పల్లవి సంతోష్‌ను చంపాలని పథకం వేసుకున్నారు.ఈనెల12న పల్లవి హన్మకొండకు వెళ్లి ఓ అమ్మాయిని ఆటోలో వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులోకి తీసుకొచ్చింది. తరువాత మద్యం కొనుగోలు చేసి అందులో నిద్ర మాత్రలను కలిపి ఆ అమ్మాయి ద్వారా సంతోష్‌కు ఇప్పించారు. మద్యం తాగిన సంతోష్‌ మత్తులోకి జారుకున్న తరువాత రాజ్‌కుమార్‌, పల్లవి బండ రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు చెప్పారు. అనంతరం వారి వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను పోసి నిప్పు అంటించి వెళ్లి పోయారు. వీరు గురువారం హుజూరాబాద్‌ పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు. హత్య కేసును చేధించిన డీసీపీలు చంద్రమోహన్‌, శ్రీనివాస్‌, ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామ్‌చందర్‌రావు, సృజన్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బందిని సీపీ అభినందించడంతో పాటు నగదు రివార్డును ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని