శుద్ధజలం... కలుషితం
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

శుద్ధజలం... కలుషితం

పైపులైన్ల లీకేజీలతో సమస్యలు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌


కిసాన్‌నగర్‌లో గత 10రోజులుగా తాగునీరు రంగుమారి సరఫరా అవుతోంది. వచ్చే కొద్ది నిమిషాల నీటిలో పది నిమిషాలు ఇలాగే సన్నగా వస్తుండటంతో నీరు సరిపోవడం లేదని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఎగువ, దిగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. నీటినిల్వ కేంద్రాల నుంచి పైపులైన్ల లీకేజీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌సిటీలో భాగంగా కొత్త పైపులైన్లు వేస్తుండగా పాత పైపులైన్లు ఉన్నచోట, ప్రధాన, అంతర్గత రహదారులపై పగుళ్లు పడుతున్నాయి. వాల్వుల దగ్గర అయితే రోజుల తరబడి తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది.

మట్టి, మురుగు నీరు సరఫరా

నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి పైపులైన్లు పగిలిపోతుండటంతో అందులోకి మురుగునీరు, మట్టి చేరుతోంది. నల్లా వచ్చే సమయంలో పైపుల్లో ఉన్న ఆ నీరు కలిసి పోయి సరఫరా అవుతుండటంతో మొత్తం నీరు కలుషితం అవుతోంది. లీకేజీల సంఖ్య అధికంగా ఉండటం, రోజుల తరబడి నీరు రంగు మారి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాల్వులు, లీకేజీల మరమ్మతులు పేరుకే అన్నట్లుగా మారింది. కిసాన్‌నగర్‌, సవారన్‌ వీధి, పాతబజారు, షాషాబ్‌వీధి, కార్కానగడ్డ, శర్మనగర్‌, అశోక్‌నగర్‌, దుర్గమ్మగడ్డ ప్రాంతాల్లో మురుగు నీరు వస్తుందని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.


ఆమేర్‌నగర్‌లోని మసీదు మూలమలుపులో మురుగునీటి కాల్వ గుండా తాగునీటి పైపులైను లీకవుతోంది. మరమ్మతులు చేయడానికి ఇబ్బందికరంగా ఉండడంతో దానిని వదిలేశారు.

45 నిమిషాల్లో..

నగర పరిధిలో ప్రతిరోజు తాగునీరు పంపిణీ చేస్తుండటంతో నీటి వృథాను ఆరికట్టేందుకు 45నిమిషాలే నల్లానీరు వస్తుంది. అలాంటి సమయంలో మొదటి 15 నిమిషాలు మురుగు, మట్టి, మడ్డితో కూడిన నీరు వస్తుండటంతో ఇంటి యజమానులు అవస్థలు పడుతున్నారు. కలుషితనీటిని సంపులో ఎలా నిల్వచేసుకోవాలని, తాగేందుకు ఎలా వినియోగించాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు శూన్యం

ప్రస్తుతం ఒకటెండ్రు రిజర్వాయర్ల పరిధిలో తప్పితే మిగతా ప్రాంతాల్లో తాగునీరు ప్రతిరోజు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ల వారీగా రోజుకు ఒక వీధిలో కనీసం ఒకటెండ్రు ఇళ్లలో క్లోరినేషన్‌ తనిఖీలు చేయాల్సి ఉండగా అవేమీ కనిపించడం లేదు. నీటివిభాగం సిబ్బంది దగ్గర తనిఖీలకు, లీకేజీల మరమ్మతుల సామగ్రి లేకపోవడంతో వారు పట్టనట్లుగా ఉంటున్నారు.


మరమ్మతులు ఎప్పుడో

భగత్‌నగర్‌, అంబేడ్కర్‌నగర్‌ రిజర్వాయర్ల పరిధిలో ప్యానల్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. సంపులను కడిగించి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా అలాగే వదిలేశారు. దాంతో రెండు ట్యాంకుల పరిధిలో తాగునీటి సరఫరాలో ఆలస్యమవుతోంది. అంబేడ్కర్‌నగర్‌ ట్యాంకుల పరిధిలో లీకేజీల సంఖ్య అధికంగా ఉంది. తారురోడ్డుపై లెక్కలేనన్ని లీకేజీలు ఉండగా మరమ్మతుల పేరిట రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. ఇప్పటికైనా నగరపాలిక నీటి విభాగం అధికారులు లీకేజీలపై దృష్టిసారించాల్సిన అవసరముంది.


పనులు పూర్తి చేయిస్తాం

- పి.వి.కృష్ణారావు, ఎస్‌ఈ, నగరపాలిక

కిసాన్‌నగర్‌ ప్రాంతంలో లీకేజీల మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. వినాయక నిమజ్జనం, ఏర్పాట్లతో జాప్యం జరిగింది. త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని