పనుల పంచాయతీ తీరేదెన్నడో..!
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

పనుల పంచాయతీ తీరేదెన్నడో..!

నిర్మాణాల పురోగతిలో నత్తనడక

 

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

నిర్మాణదశలో ఉన్న సీసీ రోడ్డు

‘ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు.’అనేలా కరీంనగర్‌ జిల్లాలో పంచాయత్‌రాజ్‌ విభాగం పర్యవేక్షణలో చేపడుతున్న పనుల పురోగతి కనిపిస్తోంది. జిల్లా ప్రగతికి బాటలు వేసేలా కీలకమైన ఈ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాల తీరు పలుచోట్ల నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా మంజూరైన నిధులను సక్రమంగా ఖర్చు చేయడం మొదలు పనుల్ని వీలైనంత తొందరగా పూర్తిచేసే తీరులో లోటుపాట్లు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడం, తలకుమించిన భారమనేలా పలురకాల పనులు ఒకటి వెనుక ఒకటి పురమాయించడంతో ఈ పనుల పందేరంలో వెనుకంజ అనే తీరు ఎదురొస్తోంది. ఫలితంగా కోట్లాది రూపాయల అభివృద్ధి విషయంలో ఇంకా నిర్లక్ష్యమనే తీరు ఆయా గ్రామాలు, పట్టణాల్లో అగుపడుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు మొదలు ఎంపీ నిధులు, సీసీ రోడ్లు, డీఎంఎఫ్‌టీ, ఉపకేంద్రాలు, పంచాయతీ భవనాలు, గోదాములు, సమాఖ్య భవనాలు ఇలా 39 రకాలుగా చేపట్టే పనుల ప్రగతి అనుకున్నంత వేగంగా దరిచేరడం లేదు.

ప్రాధాన్యతల్ని గుర్తిస్తేనే..!

జిల్లా అన్నిరకాలుగా అభివృద్ధి ఫలాల్ని అందుకోవాలనే కృతనిశ్చయంతో మంజూరైన పనుల విషయంలో సంబంధిత పర్యవేక్షణ అధికారులు మరింత ప్రాధాన్య పనులు పూర్తిచేసే విషయంలో చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో అతి ముఖ్యమైన అంతర్గత రహదారులను సీసీలుగా మార్చే విషయంలో లోపం కనిపిస్తోంది. ఇదే సమయంలో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ, సమాఖ్య భవనాలను త్వరిత గతిన పూర్తిచేస్తే మంచిది. జిల్లాలో 71 గ్రామపంచాయతీ భవనాల్లో ఇప్పటికి కేవలం 26 మాత్రమే పూర్తయ్యాయి. చాలా చోట్ల సరైన వసతి లేక పాలనాపరమైన ఇబ్బందుల్ని పంచాయతీ కార్యవర్గాలు ఎదుర్కొంటున్నాయి. 22 చోట్ల వివిధ స్థాయిలో పనులు జరుగుతుండగా ఏకంగా 23 ఊళ్లల్లో వీటి నిర్మాణానికి ముగ్గుపోయని పరిస్థితి నెలకొనడం ఆందోళనను పెంచుతోంది. మరోవైపు విపరీత జాప్యం వల్ల అంచనా వ్యయం కూడా ఇంతకింతకు పెరుగుతుండటం సర్కారు ఖజానాకు భారంగా మారనుంది. జిల్లా పాలనాధికారి ఈ పనుల పురోగతి విషయంలో ప్రత్యేకమైన సమీక్షలను నిర్వహించడంతోపాటు ఎప్పటికప్పుడు బిల్లులు, గుత్తేదారుల అనాసక్తి, ఇతరత్రాలుగా ఎదురయ్యే ఇక్కట్లను తొలగిస్తే ఊహించని వేగం జిల్లాలో కనిపించే వీలుంది.


22శాతం మొదలు పెట్టలే..!

జిల్లాకు మంజూరైన 6,964 పనుల్లో ఇప్పటివరకు 22శాతం అంటే 1,567 పనులకు ప్రారంభోత్సవ గ్రహణమే వీడటంలేదు. స్థలాల సమస్యతోపాటు గుత్తేదార్లు ముందుకు రాకపోవడంలాంటి ఎన్నో ఇక్కట్లు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా 2018-19లో వచ్చిన డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి చేయాల్సిన వాటిలో ఇంకా 348 పనులకు మోక్షమే లభించలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టాల్సిన 189 వాటి విషయంలోనూ ఇంకా నిర్లక్ష్యం వెంటాడుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వేయాల్సిన సీసీ రోడ్లు 457 చోట్ల ఆరంభమే అవలేదు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లోనూ 149 అలాగే ఉండిపోయాయి. జిల్లా పరిషత్‌ సాధారణ నిధుల విషయంలోనూ ఊహించిన విధంగా స్పందన కరవైంది. ఇంకా 78 పనులు కనీసం పునాది స్థాయికి చేరకపోవడం పర్యవేక్షణ లోపాల్ని స్పష్టంగా ఎత్తిచూపిస్తున్నాయి. మహిళా సమాఖ్య భవనాలు జిల్లా వ్యాప్తంగా 71 మంజూరవగా ఇందులో కేవలం 3 మాత్రమే పూర్తయ్యాయి. ఏకంగా 57 భవనాల నిర్మాణాలు మొదలు పెట్టకపోవడానికి సిద్ధమవలేదు.

నిర్మాణదశలో ఉన్న సీసీ రోడ్డు

మొత్తం పనులు - 6,964

అంచనా విలువ - రూ.629.09 కోట్లు

చేసిన ఖర్చు - రూ.353.10 కోట్లు

చేయాల్సిన వ్యయం- రూ.276.00 కోట్లు

పూర్తయిన పనులు - 4,799

ప్రగతిలో ఉన్నవి - 598

ప్రారంభమే కానివి - 1,567


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని