గళం విప్పాలి.. కష్టం తీర్చాలి!
eenadu telugu news
Updated : 24/09/2021 06:00 IST

గళం విప్పాలి.. కష్టం తీర్చాలి!

నేటి శాసనసభ సమావేశాలపై ఆశలు

ప్రాధాన్య రంగాలకు నిధులు అవసరం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో తమ గళం విప్పి, సమస్యల స్వరాన్ని వినిపించే అవకాశం మరోసారి వచ్చింది. నేటి నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల తీరుపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి, సంక్షేమపథకాల అమలులో ఉన్న ఇబ్బందులు తొలిగించేలా మన నేతల మాటలు సభలో వినిపించాలి. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మోక్షం లభించడం, కొత్త పింఛన్ల అమలుకు ఆమోదం తెలియజెప్పేలా ప్రస్తావనల ఊసులు కనిపించాలి. ఏళ్లతరబడి ఇక్కడి అభివృద్ధికి ఆసరాగా నిలిచే చర్యలు, ప్రాధాన్య అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లగలగాలి.


ఆరోగ్యానికి రక్షగా..

మూడోవేవ్‌ ముంచుకొస్తుందన్న భయాన్ని తొలగించేలా నాలుగు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాల్ని సమకూర్చమనేలా మన నేతల ప్రశ్నలు సంధించాలి. ముఖ్యంగా కరోనా పరీక్షల కోసం కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లా ప్రజల కోసం కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను వినియోగంలోకి తెచ్చేలా నిర్ణయాలు వినపడాలి. జగిత్యాలకు మంజూరైన వైద్యకళాశాల నిర్మాణ పనుల్లో వేగంతోపాటు సిరిసిల్ల జిల్లాకు మంజూరైన ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు నిధుల ఊసు వినిపించాలి. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖనిలోని పెద్దాసుపత్రిలో సూపర్‌స్పెషాలిటీ సేవలందేలా పడకల సామర్థ్యం పెంచేలా రాష్ట్రప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలనేలా ఎమ్మెల్యేలు మాట్లాడాలి.


వరదల సాయంపై..

మ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున పంటనష్టం సంభవించింది. నాలుగు జిల్లాల పరిధిలో పలుమార్లు పడిన భారీ వర్షాలతో 33 శాతాన్ని మించిన పంటనష్టాన్నే రైతులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 40వేలకుపైగా ఎకరాల్లో 50వేలమందికిపైగా అన్నదాతలకు అకాలవర్షం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈ విపత్తు వల్ల ఒనగూరిన నష్టంపై ఇప్పటికే ప్రభుత్వానికి వ్యవసాయశాఖ అధికారులు నివేదికను పంపారు. వాటి ఆధారంగా కర్షకుల కన్నీళ్లను తుడిచేలా మన ఎమ్మెల్యేలు ఇక్కడి దయనీయ స్థితిని అసెంబ్లీకి వినిపించాలి. వరదనీటిలో కొట్టుకుపోయి చనిపోయిన కుటుంబాలతోపాటు ఏకదాటిగా కురిసిన వానలతో కూలిపోయిన సుమారు 800కుపైగా ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమైన వాటికి పరిహారం అందించేలా చూడాలి.


ఛిద్రమైన రహదారులు..

తేడాదిలో జరిగిన నష్టాన్ని పూరించేలా నిధుల వరద జిల్లాకు రాక ముందరే మళ్లీ ఈ వర్షాకాలంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రహదారులన్ని చిధ్రమయ్యాయి. అటు ర.భ శాఖ పరిధిలోని రోడ్లతోపాటు పంచాయత్‌రాజ్‌ పర్యవేక్షణలోని మార్గాలన్నీ చాలాచోట్ల దెబ్బతిన్నాయి. కల్వర్టులు పూర్తిగా రూపును కోల్పోయాయి. కొత్తగా నిర్మించిన దారులతోపాటు లోతట్టు వంతెనలు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో జరిగిన నష్టాల్ని గుర్తించిన అధికారులు ఎంతలేదన్నా రూ.400కోట్ల వరకు వీటి మరమ్మతులకు నిధులు అవసరమనేలా ప్రతిపాదనల్ని పంపారు. ఈ సమావేశాల్లో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ జిల్లాల దుస్థితిని దయనీయంగా తెలియజెప్పేలా అమాత్యులు, ఎమ్మెల్యేలు తమ బాణిని వినిపించాలి. తక్షణమే నిధుల్ని అందించేలా హామీలను అందుకోగలుగాలి. కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది వేసవిలో నిర్మించిన చెక్‌డ్యామ్‌లలో చాలాచోట్ల కరకట్టలతోపాటు నిర్మించిన నిర్మాణాలు నీటి పాలయ్యాయి. ఇలా కోట్లాదిరూపాయల నష్టం తీరు.. ప్రశ్నార్థకంగా మారిన నాణ్యత తీరుపై నిండు సభలో గొంతు వినిపించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని